Paagal Trailer: అలరిస్తోన్న ‘పాగల్‌’ ట్రైలర్‌

లవర్‌బాయ్‌గా విశ్వక్‌ సేన్‌ నటించిన చిత్రం ‘పాగల్‌’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. సిమ్రన్‌ చౌదరి, మేఘాలేఖ, రాహుల్‌ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Updated : 10 Aug 2021 12:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లవర్‌బాయ్‌గా విశ్వక్‌ సేన్‌ నటించిన చిత్రం ‘పాగల్‌’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. సిమ్రన్‌ చౌదరి, మేఘాలేఖ, రాహుల్‌ రామకృష్ణ, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్‌ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్‌ని విడుదల చేసింది. ‘నా పేరు ప్రేమ్‌. నేను 1600 మంది అమ్మాయిల్ని ప్రేమించాను’ అని విశ్వక్‌ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ అలరిస్తూనే భావోద్వేగానికి గురిచేస్తోంది. ఎప్పుడూ స్నేహితులతో సరదాగా తిరుగుతూ అమ్మాయిల గురించి ఆలోచించే విశ్వక్‌కి సడెన్‌గా నాయిక నివేదా పరిచయమవుతుంది. అంతే.. తన జీవితం మారిపోతుంది. ‘చూడు.. ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇప్పటి నుంచి ఒకెత్తు. నేను చాలామంది అమ్మాయిలకు ఐ లవ్‌ యు చెప్పాను. కానీ, నిన్ను మాత్రమే లవ్‌ చేస్తున్నా’ అని తన ప్రేమని వ్యక్తం చేస్తాడు. ‘నువ్వూ నేనూ కలిసుండటం జరగదు. అది మనద్దరికీ మంచిది కాదు’ అని బదులిస్తుంది హీరోయిన్‌. మరి ఈ ఇద్దరి మధ్య ఏం జరిగింది? వాళ్ల ప్రేమ ఎందుకు బ్రేకప్‌ అయింది? మళ్లీ కలుసుకుంటారా, లేదా? త్వరలోనే తెలియనుంది.

ట్రైలర్‌లో కనిపించిన అందరి నటనా ఆకట్టుకుంటుంది. రాహుల్‌ రామకృష్ణ, మహేశ్‌ ఆచంట కడుపుబ్బా నవ్వించారు. గీత ఎక్కడుంటుంది సర్‌ అని విశ్వక్‌ని ఓ వ్యక్తి అడగ్గా.. గీతకి సంబంధించి పెద్ద జాబితాని బయటపెట్టే సంభాషణ అలరిస్తుంది. నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. రధన్‌ సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని