Puneeth Rajkumar: అప్పూ మరణం తీరని లోటు.. సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి

కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడ్ని కోల్పోయింది. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు  దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Updated : 29 Oct 2021 20:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ చిత్ర పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణంతో శాండిల్‌వుడ్‌తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాలమరణ వార్త విన్న సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రముఖులతో పాటు, రాజకీయ ప్రముఖులు సైతం సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

షాక్‌కు గురయ్యా..: సీఎం బొమ్మై

పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. పునీత్‌ ఆకస్మిక మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. కన్నడిగుల అభిమాన హీరో అప్పూ మరణం కన్నడ చిత్రసీమకు, కర్ణాటకకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, పునీత్‌ ఇకలేరన్న బాధను తట్టుకొనే శక్తిని అభిమానులకు భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నట్టు ట్విటర్‌లో తెలిపారు.అంతకముందు పునీత్‌ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి.. నేరుగా ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

హఠాన్మరణం కలిచివేస్తోంది.. యడియూరప్ప

పాపులర్‌ సినీ హీరో రాజ్‌కుమార్‌ ఆకస్మిక మరణం తనను షాక్‌కి గురిచేసిందని కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప అన్నారు. చిన్న వయస్సులోనే మనందరినీ వదిలి వెళ్లిపోవడం కలిచివేస్తోందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. పునీత్‌ నటించిన అనేక చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు.

* హృదయం ముక్కలైంది. పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంత త్వరగా మనల్ని వదలి వెళ్లారనే వార్త విస్మయానికి గురి చేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. - చిరంజీవి

* అప్పూ మృతితో గొప్ప స్నేహితుడ్ని కోల్పోయా. ఆయన మృతి కన్నడ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసి కథానాయకుడు, గాయకుడు, నిర్మాత, బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రతిభ చాటాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. - నందమూరి బాలకృష్ణ.

* పునీత్‌ రాజ్‌కుమార్‌ చాలా మంచి మనిషి. భగవంతుడు కొన్నిసార్లు ఇలా ఎందుకు చేస్తాడో నాకు అర్థంకాదు. యావత్‌ సినీ ప్రపంచానికి విషాదకరమైన రోజు ఇది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలుపుతున్నా. - మోహన్‌ బాబు

* ‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇకలేరన్న వార్త విని షాకయ్యా. యువకుడు, అద్భుతమైన వ్యక్తి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం విచారకరం. ఒకట్రెండు సార్లు మాత్రమే ఆయనను కలిశా. ఆ సమయంలో ఆయన ఇచ్చిన ఆతిథ్యం, చూపిన ప్రేమ, ఆప్యాయత మర్చిపోలేను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ -దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి

* పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. వారి కుటుంబ సభ్యులకు నా సానుభూతి. రాజ్‌కుమార్‌ ఆత్మకు శాంతి కలగాలి. -నాగార్జున.

* ‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ తుదిశ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా. నమ్మశక్యం కాలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నా’’ -పవన్‌ కల్యాణ్‌

* పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇక లేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను కలిసిన, మాట్లాడిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాఢ సంతాపం. - మహేశ్‌బాబు.

*  నా ప్రియమైన సోదరుడు పునీత్‌ రాజ్‌కుమార్ కల్మషం లేని వ్యక్తి. తన తండ్రి నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. నటనతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సంతాపం. - రామ్‌ చరణ్‌

* హృదయం బద్దలైంది. మమ్మల్ని వదిలి మీరు ఇంత త్వరగా వెళ్లిపోయారనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. - జూనియర్‌ ఎన్టీఆర్‌.

* అంత త్వరగా వెళ్లిపోయావా అప్పూ! ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. నా హృదయం ముక్కలైంది. నా జీవితంలో ఇది ‘బ్లాక్‌ ఫ్రైడే’. - ప్రకాశ్‌రాజ్‌.

* హృదయం ముక్కలైంది... పునీత్‌ రాజ్‌కుమార్‌ అన్నా.  -మంచు మనోజ్‌.

* ఇది నిజం కాదు. పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని నేను నమ్మలేకపోతున్నా. వారి ఆత్మకు శాంతి కలగానికి ప్రార్థిస్తున్నా. - మంచు లక్ష్మి.

* పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్తతో షాక్‌కు గురయ్యాను. వారి కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం తెలియజేస్తున్నా. - వరుణ్‌ తేజ్‌.

* పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్తతో హృదయం పగిలింది. ఆయన లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. వారి కుటుంబ సభ్యులకు, స్నేహితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. - దర్శకుడు కె. ఎస్‌. రవీంద్ర (బాబీ).

* పునీత్‌ రాజ్‌కుమార్‌ పవర్‌ఫుల్‌ నటుడు. తన నటనతో కొన్ని లక్షల హృదయాల్ని గెలుచుకున్నారు. అలాంటి ఆయన మరణ వార్త షాక్‌కి గురిచేసింది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. - బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌.

* నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో పునీత్‌ రాజ్‌కుమార్‌ ఒకరు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండేవారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా. - నటుడు రామ్‌ పోతినేని.

* కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్‌గారి కుమారుడు, అద్భుతమైన అభినయం, చాతుర్యం ఉన్న పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇక లేరనే నిజం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దైవాన్ని ప్రార్థిస్తున్నా. - రచయిత పరుచూరి గోపాలకృష్ణ.

* పునీత్‌ రాజ్‌కుమార్‌ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం భారతీయ చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నా. - పూజా హెగ్డే.

* ‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ మృతిని నమ్మలేక పోతున్నాను. పునీత్‌ నాతో చాలా సన్నిహితంగా ఉంటారు. చిన్న వయసులోనే పునీత్‌ మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సుదీర్ఘకాలం సినిమాలు తీయాల్సి ఉంది. పునీత్‌ మృతిని తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’ -చరణ్‌రాజ్‌

నమ్మలేకపోతున్నా..:డీకేఎస్‌

పునీత్‌ మరణించారన్న విషయాన్ని అంగీకరించలేకపోతున్నట్టు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘రాజ్‌కుమార్‌ మంచి గాయకుడు కూడా. బాలనటుడిగా తెరంగ్రేట్రం చేసి గొప్ప హీరోగా ఎదిగారు. ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. పవర్‌స్టార్‌ సినీ ప్రేమికులందరి హృదయాల్లో ఉంటారు’’ అని పేర్కొన్నారు. పునీత్‌తో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు.













Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని