Ugram: నిజాయతీగా చేసిన మరో ప్రయత్నం... ఉగ్రం

‘‘నా ప్రయాణంలో 60 సినిమాలు చేశా. శారీరకంగా ఈ సినిమాకి కష్టపడినంతగా మరే సినిమాకి కష్టపడలేదు. మానసికంగా కూడా అంతే అలసటకి గురిచేసిన చిత్రమిది. మేమంతా కష్టపడి ఇష్టపడి చేశాం.

Updated : 23 Feb 2023 07:09 IST

‘‘నా ప్రయాణంలో 60 సినిమాలు చేశా. శారీరకంగా ఈ సినిమాకి కష్టపడినంతగా మరే సినిమాకి కష్టపడలేదు. మానసికంగా కూడా అంతే అలసటకి గురిచేసిన చిత్రమిది. మేమంతా కష్టపడి ఇష్టపడి చేశాం. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తాం’’ అన్నారు అల్లరి నరేష్‌ (Allari Naresh). ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఉగ్రం’ (Ugram). మిర్నా కథానాయిక. విజయ్‌ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు.  షైన్‌ స్క్రీన్స్‌  పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. ప్రముఖ  కథానాయకుడు నాగచైతన్య (Naga Chaitanya) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీజర్‌ విడుదల అనంతరం నాగచైతన్య మాట్లాడారు. ‘‘నరేష్‌ ‘నాంది’ తర్వాత మళ్లీ అలాంటి ఓ గాఢమైన కథ, పాత్రలో నటించడం బాగుంది. ‘అల్లరి’తో మొదలైన ఆయన ప్రయాణం ‘ఉగ్రం’ వరకూ వచ్చింది. ఇదొక అద్భుతమైన ప్రయాణం’’అన్నారు. అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ‘‘నాకు చాలా ఇష్టమైన వ్యక్తి నాగచైతన్య. తన చేతులమీదుగా ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. ఒక దర్శకుడిని ఎంతగా నమ్మితే అంతగా ఫలితాలుంటాయి. మా నాన్నని నమ్మినప్పుడు వరుసగా విజయాలు వచ్చాయి. దాని తర్వాత క్రిష్‌ని నమ్మినప్పుడు ‘గమ్యం’, సముద్రఖనిని నమ్మినప్పుడు ‘శంభో శివ శంభో’ వచ్చింది. ఆ తర్వాత విజయ్‌ కనకమేడల వచ్చారు. మీరు రెగ్యులర్‌ కామెడీ కథలతోనే వెళుతున్నారు,  బయటికొచ్చి విభిన్నమైన సినిమా చేద్దామంటూ ‘నాంది’తో కొత్త దారి చూపించారు. అప్పటి నుంచి నా పేరు ముందు అల్లరిని తీసి, నరేష్‌ని మాత్రమే తీసుకొచ్చాం. టీజర్‌లో ‘నాది కాని రోజు కూడా అలాగే నిలబడతా’ అనే ఓ  డైలాగ్‌ ఉంది. అలా నాది కాని రోజు కూడా విజయ్‌ నిలబడ్డాడు. ఏ రోజుకైనా తన విషయంలోనూ అలాగే నిలబడతా’’ అన్నారు. విజయ్‌ కనకమేడల మాట్లాడుతూ ‘‘నిజాయతీగా సినిమా తీస్తే ప్రేక్షకులు ఎంత గొప్పగా ఆదరిస్తారో ‘నాంది’ నిరూపించింది.  ‘ఉగ్రం’ కూడా అదే తరహాలో తీశాం. నిజాయతీగల పోలీస్‌ అధికారి కుటుంబాన్ని టచ్‌ చేస్తే ఎలా ఉంటుందో ‘ఉగ్రం’లో చూపిస్తాం’’ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని