Veera Simha Reddy: ‘వీర సింహారెడ్డి‌’ ప్రీ రిలీజ్‌.. ఒంగోలులో ట్రాఫిక్‌ ఆంక్షలు

పోలీసుల ఆంక్షల నడుమ ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు సర్వం సిద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం ఒంగోలులో జరగనున్న ఈ ఈవెంట్‌లో చిత్రబృందం, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. 

Published : 06 Jan 2023 10:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నందమూరి బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీర సింహారెడ్డి’ (Veera Simha Reddy) ప్రీ రిలీజ్‌ వేడుకకు ఒంగోలులోని బీఎంఆర్‌ వెంచర్స్‌ సిద్ధమవుతోంది. చిత్ర నటీనటులతోపాటు భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొననున్న ఈ కార్యక్రమం కోసం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి కోసం మంగమ్మ కాలేజీ, మార్కెట్ యార్డ్‌ల్లో పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు.

ఉత్కంఠ నడుమ..!

‘వీరసింహారెడ్డి’ ముందస్తు విడుదల వేడుక ఈనెల 6న (శుక్రవారం) సాయంత్రం నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించుకున్నప్పటి నుంచి అభిమానులు ఆశగా ఎదురుచూశారు. తర్జనభర్జనలు, తీవ్ర ఉత్కంఠ నడుమ త్రోవగుంట సమీపంలోని బీఎంఆర్‌ అర్జున్స్‌ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన స్థలంలో కఠిన నిబంధనల నడుమ వేడుకకు పోలీసులు అనుమతినిచ్చారు. తొలుత ఈ కార్యక్రమాన్ని స్థానిక రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఏబీఎం కళాశాల మైదానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. నిర్వహణ బాధ్యతలు చూసే శ్రేయాస్‌ మీడియా ప్రతినిధులు ఎస్పీ మలికా గార్గ్‌తో సమావేశమయ్యారు. అర్జున్స్‌ ఇన్‌ఫ్రా సంస్థకు చెందిన 17 ఎకరాల స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించి ఇక్కడ ఏర్పాటుకు అనుమతి కోరారు. బుధవారం రాత్రంతా తర్జనభర్జనలు జరిగాయి. చివరకు వేడుక నిర్వహణకు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చిన అధికారులు పార్కింగ్‌ ప్రదేశాలు, ఇతర అంశాలపై మెలిక పెట్టారు. గురువారం ఉదయం నుంచి పనులు ఆరంభించిన నిర్వాహకులు సాయంత్రానికి ప్రధాన వేదిక, లైటింగ్‌, ఎల్‌ఈడీ తెరలు, బారికేడ్లు, వివిధ గ్యాలరీల నిర్మాణాలు చేపట్టారు. అదనపు ఎస్పీ(అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ నాగరాజు, దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సందర్శించి పలు సూచనలు చేశారు. సుమారు వెయ్యి మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.. రూ.15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్‌ చెల్లించాలని సూచించారు. అనుమతించిన సంఖ్య కంటే అదనంగా ప్రేక్షకులను లోపలికి రానివ్వకూడదని, అక్కడ జరిగే ప్రతి విషయానికీ నిర్వాహకులే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. నిర్వాహకులు జారీ చేసిన పాసులు ఉన్నవారికి మాత్రమే ప్రాంగణంలోకి అనుమతి ఉంటుందని.. వాటికి కూడా స్థానిక పోలీసుల స్టాంపింగ్‌ తప్పనిసరని పేర్కొన్నారు. ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల ఏర్పాటుతో పాటు వివిధ గ్యాలరీలకు పటిష్టమైన బ్యారికేడింగ్‌ ఏర్పాటు చేయాలని.. బాణసంచా కాల్చకూడదని సూచించారు. వేడుకలకు పోలీసు భద్రత ఉంటుందని.. అయితే నిర్వాహకులు సైతం తగిన సంఖ్యలో బౌన్సర్లు, వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్నారులు, వృద్ధులను ప్రాంగణంలోకి అనుమతించకూడదని.. సినిమాకు సంబంధించి మినహా, మరే ఇతర రెచ్చగొట్టే నినాదాలు చేయకూడదని నిబంధనలు విధించారు.

ట్రైలర్‌ రానుంది..!

మాస్‌ యాక్షన్‌, ఫ్యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘వీర సింహారెడ్డి’ ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేదికగా ట్రైలర్‌ విడుదల జరగనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. దీంతో నందమూరి అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించిన ఈసినిమా కోసం బాలకృష్ణ, శ్రుతిహాసన్‌ మొదటిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ఈ సినిమా విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని