తెలుగు కళామతల్లికి చిరంజీవి మూడో కన్ను: వెంకయ్యనాయుడు

తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు.

Updated : 04 Feb 2024 14:57 IST

హైదరాబాద్‌: తన జీవితంలో అవార్డులు, సన్మానాలు పెద్దగా తీసుకోలేదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah naidu) అన్నారు. పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తున్నట్లు కేంద్రం చెబితే ప్రధాని మోదీపై గౌరవంతో అంగీకరించానని చెప్పారు. పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం శిల్పకళావేదికలో సన్మానించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

‘‘పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి సన్మానం చేయడం గొప్ప విషయం. సీఎం రేవంత్‌ను అభినందిస్తున్నా. గుర్తింపు పొందని వ్యక్తులకు అది లభించేలా పద్మ అవార్డులు ప్రకటించారు. మట్టిలో మాణిక్యాలను గుర్తించి ఈ పురస్కారాలు ఇవ్వడం గొప్ప విషయం. రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. దీన్ని సరిదిద్దాల్సిన కర్తవ్యం మనందరిది. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులు విలువలు పాటించాలి. తెలుగు కళామతల్లికి ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ రెండు కళ్లు.. చిరంజీవి మూడో కన్ను. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధ్యమే’’

‘‘ప్రేక్షకుల్ని అలరించేందుకు శ్రమించడం ఒకెత్తు అయితే.. అసభ్యత, అశ్లీలం, హింసకు తావివ్వకుండా  ఇంతకాలం నటించడం మరో ఎత్తు. ఈ విషయంలో చిరంజీవిని ఇతరులు  ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బ్లడ్‌ బ్యాంక్‌ స్థాపించి, నిరంతరంగా సేవలు అందించడం అభినందించదగ్గ విషయం. ఇష్టపడే పనిని కష్టపడి చేస్తే నష్టం ఉండదు. ఇందుకు ఆయన జీవితమే ఓ ఉదాహరణ. ఏ రంగంలో అయినా విలువలు పాటించడం ముఖ్యం. అసెంబ్లీ, పార్లమెంట్‌లో జరిగే గలాటాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నీతి, నిజాయతీ లేని వారికి, ప్రజలను రెచ్చగొట్టి గెలిచేవారికి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని