Venkatesh: ‘నాగా నాయుడు’ మళ్లీ వస్తాడు.. అయితే ఆ కంటెంట్‌ తగ్గిస్తాం: వెంకటేశ్‌

‘రానానాయుడు’ (Rana Naidu) వెబ్‌సిరీస్‌ విషయంలో ఎదురైన విమర్శల గురించి నటుడు వెంకటేశ్‌ (Venkatesh) మాట్లాడారు. ఆ సిరీస్‌లోని కంటెంట్‌కు తెలుగు ప్రేక్షకులు కాస్త ఇబ్బందిపడ్డారని అన్నారు.

Published : 16 Oct 2023 14:26 IST

హైదరాబాద్‌: తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో తెలుగు సినీ పరిశ్రమలో త్వరలో వరుస చిత్రాల్లో రానున్నాయి. అందులో ఒకటి ‘సైంధవ్‌’ (Saindhav). వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా శైలేశ్‌ కొలను ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జనవరి 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సోమవారం ‘సైంధవ్‌’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో వెంకటేశ్‌ పాల్గొన్నారు. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘ఇది నా 75వ చిత్రం. మీ అందరి ప్రేమాభిమానాల వల్లే నా ప్రయాణం ఇక్కడి వరకూ వచ్చింది. నా తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ నుంచి ఇప్పటివరకూ మీడియా, సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్లందరూ నన్నెంతో ప్రోత్సహించారు. ఇప్పటివరకూ ఎలాంటి డల్‌ మూమెంట్‌ లేదు. జనవరి 13న ‘సైంధవ్‌’ విడుదల కానుంది. సంక్రాంతి సమయంలో రానున్న ఈసినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నా’’ అని వెంకటేశ్‌ అన్నారు.

‘సైంధవ్‌’ను అంగీకరించడానికి ప్రధాన కారణం ఏమిటి?

వెంకటేశ్‌: ‘సైంధవ్‌’కు ముందు ఎన్నో కథలు విన్నా. అన్నీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, కామెడీ ఎంటర్‌టైనర్సే. అలాంటి సమయంలో శైలేశ్‌ ‘సైంధవ్‌’ కథతో నా వద్దకు వచ్చారు. ఇదొక అద్భుతమైన కథ. న్యూ స్టైల్‌ ఆఫ్‌ యాక్షన్‌కు ఇందులో స్కోప్‌ ఉంది. ఇందులో ఉన్న ఎమోషన్స్‌ను ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండనుంది?

వెంకటేశ్‌: వైల్డ్‌, క్రేజీగా ఉంటుంది. ఫ్యామిలీ, యూత్‌ ప్రతి ఒక్కరికి ఈ పాత్ర నచ్చుతుంది. ఈ పాత్రలో అన్నిరకాల భావోద్వేగాలుంటాయి. మీరు తప్పకుండా ఒక కొత్త వెంకీని చూస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమాలో హీరోకి సైకో అనే ముద్దుపేరు పెట్టారు. దానికి కారణం ఏమిటి?

శైలేశ్‌ కొలను: ఇందులో హీరో పూర్తి పేరు సైంధవ్‌ కోనేరు. దాన్ని షార్ట్‌ కట్‌లో సైకో చేశా.

ఈ చిత్రానికి ‘సైంధవ్‌’ అనే పేరు ఫిక్స్‌ చేసినప్పుడు మీరు ఏం అనుకున్నారు?

వెంకటేశ్‌: శైలేశ్‌ చెప్పిన కథ వినగానే అది నాకెంతో నచ్చేసింది. ‘సైంధవ్‌’ అనే టైటిల్‌ పెడుతున్నామని చెప్పారు సరే అన్నా.  హీరో పాత్రకు తగిన విధంగానే ఈ టైటిల్‌ పెట్టారని షూట్‌ చేస్తున్నప్పుడు అర్థమైంది.

శైలేశ్‌ కథ చెప్పగానే మీరు ఓకే చేయడానికి ప్రధాన కారణం ఏమిటి?

వెంకటేశ్‌: ఈ కథలో భావోద్వేగాలు ఎంతో బలంగా ఉన్నాయి. కుమార్తె సెంటిమెంట్‌ని కొత్తగా చూపించారు. పెర్ఫార్మెన్స్‌ విషయంలో నాకు మరింత స్కోప్‌ లభించింది. న్యూ లుక్‌. అలాగే ప్రేక్షకులకు ఇలాంటి సినిమా అందించాలనుకున్నా.

దీనికి సీక్వెల్‌ ఏదైనా ఉంటుందా?

వెంకటేశ్‌: ఉండొచ్చు. ప్రేక్షకులు ఆదరిస్తే ఉంటుంది. లేకపోతే ఉండదు.

Upcoming Movies in Telugu: థియేటర్‌ దద్దరిల్లేలా ఈ దసరా.. బాక్సాఫీస్‌/ఓటీటీ చిత్రాలివే!

తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో ఇప్పుడు వరుస సినిమాలు వస్తున్నాయి. త్వరలో రానున్న ‘భగవంత్‌ కేసరి’, ‘హాయ్‌ నాన్న’ చిత్రాల ఎఫెక్ట్‌ మీ సినిమాపై ఉంటుందని అనుకుంటున్నారా?

శైలేశ్‌: డాటర్‌ సెంటిమెంట్‌తో నేను ఏదైతే టాపిక్‌ చెప్పాలనుకుంటున్నానో అది ఇప్పటి వరకూ తెలుగు సినీ పరిశ్రమలో చూడని అంశం.

కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ లాంటి అగ్రహీరోలు తమ ఇమేజ్‌ మార్చుకుని విభిన్న చిత్రాలు చేస్తున్నారు. ఆ ప్రభావం మీపై ఏమైనా ఉంటుందా?

వెంకటేశ్‌: ఏ నటుడికైనా మంచి కథ రావాలి. సీనియర్‌ నటుడు లేదా జూనియర్‌ యాక్టర్‌ అని కాదు. మంచి కథను సెలక్ట్‌ చేసుకుని అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా చేస్తే తప్పకుండా ప్రేక్షకులకు రీచ్‌ అవుతారు. ఇకపై ఎక్కువగా పరిణతి చెందిన పాత్రల్లో నటిస్తా అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే సైంధవ్‌ పాత్రను కూడా ఎంచుకున్నా.

మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ ఏదైనా చేయవచ్చు కదా?

వెంకటేశ్‌: తప్పకుండా చేయాలనుకుంటున్నా.  రైటర్స్‌ని కూడా మెచ్యూర్డ్‌ లవ్‌స్టోరీ ఇవ్వమని అడుగుతున్నా.

పెద్దోడు ‘సైంధవ్‌’తో చిన్నోడు ‘గుంటూరు కారం’తో వస్తున్నారు కదా. దానిపై ఏమైనా స్పందించగలరు?

వెంకటేశ్‌: పెద్దోడు వస్తే సూపర్‌హిట్‌. చిన్నోడు వస్తే సూపర్‌హిట్‌. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చూడలేదా. ప్రేక్షకులు మా సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. పండక్కి మా ఇద్దరి సినిమాలు విడుదల కావడం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది.

వెబ్‌సిరీస్‌, ఓటీటీ సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారా?

వెంకటేశ్‌: అమెజాన్‌, నెట్‌ప్లిక్స్‌ నా కోసం స్క్రిప్ట్స్‌ సిద్ధం చేస్తున్నాయి. ‘రానా నాయుడు 2’ ఉంటుంది. నాగా నాయుడు మళ్లీ వస్తాడు.

‘రానా నాయుడు’ ప్రాజెక్ట్‌ విషయంలో తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి కదా. దానిపై మీరు స్పందించగలరు?

వెంకటేశ్‌: ప్రపంచవ్యాప్తంగా ఆ సిరీస్‌ ఎంతోమంది ప్రేక్షకులకు రీచ్‌ అయ్యింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు నన్ను నాగా నాయుడు అనే పిలుస్తున్నారు. అది నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. అహ్మదాబాద్‌లో మ్యాచ్‌కు వెళ్లినప్పుడు కూడా అదే జరిగింది. ‘రానా నాయుడు’ హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో ఆ కంటెంట్‌ను చాలా వరకూ తగ్గించాం. భవిష్యత్తులో ఇంకా తగ్గిస్తాం.

ఇప్పటివరకూ నటించిన ఏ చిత్రానికి సీక్వెల్‌ చేయాలనుకుంటున్నారు?

వెంకటేశ్‌: బొబ్బిలి రాజా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని