Vidya Balan: కాఫీకి వెళ్తే రూమ్‌కి రమ్మన్నాడు.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై విద్యాబాలన్‌ వైరల్‌ కామెంట్స్‌

క్యాస్టింగ్‌ కౌచ్‌పై విద్యాబాలన్‌ (Vidya Balan) చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయ్యాయి. ఓ దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాలని చూశాడని ఆమె చెప్పింది.

Published : 11 Mar 2023 10:06 IST

ముంబయి: క్యాస్టింగ్‌ కౌచ్‌పై బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ (Vidya Balan) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాలనుకున్నాడని ఆమె ఆరోపించింది. తెలివిగా వ్యవహరించి అతడి బారి నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించింది. ‘‘అదృష్టవశాత్తు క్యాస్టింగ్‌ కౌచ్‌ ఊబిలో నేను చిక్కుకోలేదు. ఇండస్ట్రీలోకి వచ్చే ముందే.. ఇక్కడ పరిస్థితులు భయానకంగా ఉంటాయని చాలామంది నాకు కథలు కథలుగా చెప్పారు. అందుకే నా తల్లిదండ్రులు భయపడి నన్ను సినిమాల్లో పంపించడానికి అంత ఇష్టపడలేదు’’ అని విద్యాబాలన్‌ తెలిపింది. ఇప్పటివరకు తాను క్యాస్టింగ్‌ కౌచ్‌ ఎదుర్కొలేదని, అయితే గతంలో ఓసారి ఆ బారి నుంచి తృటిలో తప్పించుకున్నానని చెప్పింది.

‘‘కానీ, నా కెరీర్‌లో జరిగిన ఓ సంఘటనను ఎప్పటికీ మర్చిపోలేను. యాడ్‌ షూట్‌ కోసం చెన్నైకు వెళ్లినప్పుడు ఓ దర్శకుడు నాతో అభ్యంతరకరంగా ప్రవర్తించాలనుకున్నాడు. సినిమా గురించి చర్చించడానికి మేమిద్దరం కాఫీ షాప్‌కు వెళ్లాం. కథ గురించి మాట్లాడుతున్న సమయంలో.. ‘మిగతా విషయాలు మనం రూమ్‌కు వెళ్లి మాట్లాడుకుందాం’ అన్నాడు. ఒక్కదానినే ఉండటం వల్ల భయపడుతూనే రూమ్‌కి వెళ్లాను. అక్కడికి వెళ్లిన వెంటనే తెలివిగా వ్యవహరించి గది తలుపులు తెరిచే పెట్టాను. అతడికి ఏం చేయాలో పాలుపోక అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయాడు. ఆ క్షణం అలా చేయమని నాకు ఎవరూ సలహాలు ఇవ్వలేదు. సమయస్ఫూర్తితో వ్యవహరించి నన్ను నేను రక్షించుకున్నా’’ అని వివరించింది.

బెంగాలీ చిత్రాలతో కెరీర్‌ ఆరంభించిన విద్యాబాలన్‌ (Vidya Balan).. బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించింది. ‘డర్టీ పిక్చర్‌’తో ఆమె మంచి పేరు సొంతం చేసుకుంది. ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్‌ మహానాయకుడు’తో తెలుగు వారికీ చేరువయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని