Laatti review: రివ్యూ: లాఠీ

Laatti Review: విశాల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా నటించిన యాక్షన్‌ చిత్రం ‘లాఠీ’ ఎలా ఉందంటే?

Updated : 22 Dec 2022 17:26 IST

Laatti Review: చిత్రం: లాఠీ; న‌టీన‌టులు:  విశాల్, సునైనా, ప్రభు, మునిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్ త‌దిత‌రులు; సంగీతం: యువన్ శంకర్ రాజా; ర‌చ‌న‌: పొన్ పార్థిబన్; ఛాయాగ్ర‌హ‌ణం: బాలసుబ్రహ్మణ్యం, బాలకృష్ణ తోట; పోరాటాలు:  పీట‌ర్ హెయిన్‌; నిర్మాణం: ర‌మ‌ణ, నంద‌; దర్శకత్వం: ఎ వినోద్ కుమార్; బ్యానర్: రానా ప్రొడక్షన్స్; విడుద‌ల‌:  22-12-2022

విశాల్ (Vishal)  మెరుపు వేగంతో సినిమాలు చేస్తుంటారు. ఆయ‌న సినిమా అంటే త‌మిళంలోనే కాదు...  తెలుగులోనూ త‌ప్ప‌కుండా విడుద‌ల‌వుతుంటుంది. తెలుగులో బ‌ల‌మైన మార్కెట్‌ని సొంతం చేసుకున్న క‌థానాయ‌కుల్లో ఆయన ఒక‌రు. యాక్ష‌న్ క‌థ‌ల్లోనే ఎక్కువ‌గా సంద‌డి చేసే విశాల్.. ‘లాఠీ’ (Laatti Review) తో మ‌రోసారి ఆ త‌ర‌హా ప్ర‌య‌త్న‌మే చేశారు. వివిధ భాషల్లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? కానిస్టేబుల్‌ పాత్రలో విశాల్‌ ఎలా నటించారు?

క‌థేంటంటే: ముర‌ళీకృష్ణ (విశాల్‌) ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రించే ఓ పోలీసు కానిస్టేబుల్‌.   ఓ కేస్ విష‌యంలో  నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని స‌స్పెన్ష‌న్‌కు గుర‌వుతాడు.  ఆ త‌ర్వాత డీఐజీ క‌మ‌ల్ (ప్ర‌భు) అండ‌తో అతను మ‌ళ్లీ విధుల్లో చేర‌తాడు.  ముర‌ళీ వట్టి అమాయ‌కుడని, ఒక‌రిని హింసించ‌డం నచ్చ‌ని పోలీస్ అని డిపార్ట్‌మెంట్‌లో పేరు. భార్య క‌విత (సునైన‌),  త‌న అబ్బాయి రాజునే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. అనుకోకుండా డీఐజీ క‌మ‌ల్ త‌న క‌స్ట‌డీలో ఉన్న ఓ నేర‌స్థుడిని లాఠీతో శిక్షించాల‌ని ముర‌ళీని  కోర‌తాడు. పై అధికారి చెప్ప‌డంతో ఆ నేర‌స్థుడు ఎవ‌ర‌నేది కూడా చూడ‌కుండా  లాఠీతో శిక్షిస్తాడు.  పేరు మోసిన దాదా సూరా కొడుకు వీరానే ఆ నేర‌స్థుడని ఆ త‌ర్వాత తెలుస్తుంది.  త‌న‌ని ప‌ట్టుకున్న పై అధికారి క‌మ‌ల్‌ని కాకుండా... త‌న‌ని కొట్టిన ముర‌ళీకృష్ణ‌పై వీరా అత‌ని తండ్రి సూరా  క‌క్ష పెంచుకుంటాడు.  మ‌రి ఆ ఇద్ద‌రూ ముర‌ళీని, అత‌ని కుటుంబాన్ని ఏం చేశారు?  (Laatti Review) నిజంగా వీరా ఎవ‌రో తెలియ‌కుండానే అత‌న్ని ముర‌ళీ కొట్టాడా?  ఓ సాధార‌ణ పోలీస్ కానిస్టేబుల్ పోరాటం ఎలా సాగిందనేదే మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ఓ పోలీస్ కానిస్టేబుల్ క‌థ ఇది. ప్ర‌తీకారం తీర్చుకోవ‌డం కోసం ఓ ముఠా చేసే ప్ర‌య‌త్నాలు, వాటిని ఒక్క‌డే సైన్యంగా ఓ సాధార‌ణ  పోలీస్ కానిస్టేబుల్ ఎదుర్కొనే వైనమే ఈ చిత్రం. (Laatti Review) మాస్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే విశాల్ మార్క్ అంశాలున్నాయి కానీ... సుదీర్ఘంగా సాగే పోరాట ఘ‌ట్టాలు, డ్రామాటిక్‌గా అనిపించే కొన్ని స‌న్నివేశాలు నిరాసక్తిని కలిగిస్తాయి క‌థ‌, క‌థ‌నాలు అల‌వాటైన, ఇదివ‌ర‌కు చూసేసిన ఫార్మాట్‌లోనే సాగ‌డం ప్ర‌ధాన లోపంగా అనిపిస్తుంది.  ప్ర‌థ‌మార్ధం  చాలా స‌హ‌జంగా,  ఓ కానిస్టేబుల్ జీవితాన్ని ద‌గ్గ‌ర్నుంచి చూసిన అనుభూతి క‌లిగింది.  పై అధికారి చెప్పాడ‌ని ఓ నేర‌స్థుడిని కొట్ట‌డం, అత‌ను క‌క్ష పెంచుకోవ‌డం, అత‌ని సెల్‌ఫోన్‌లోని రింగ్ టోన్ ఆధారంగా  ఆ కానిస్టేబుల్ ఎవ‌రో క‌నిపెట్టేందుకు ముఠా ప్ర‌య‌త్నించ‌డం వంటి సన్నివేశాలు బాగున్నాయి.

ద్వితీయార్ధమే ఓ ప‌ట్టాన సినిమా ముందుకు క‌ద‌ల‌దు. నిర్మాణంలో ఉన్న ఓ భ‌వ‌నంలో  దాదాపు 45 నిమిషాల‌పాటు చుట్టుముట్టిన  వంద‌ల మంది రౌడీల నేప‌థ్యంలో  సాగే పోరాట ఘ‌ట్టాలు అల‌స‌ట‌కి గురిచేస్తాయి. కొన్ని స‌న్నివేశాల్ని డిజైన్ చేసిన విధానం బాగున్నా, కొన్ని మాత్రం నాట‌కీయంగా అనిపిస్తాయి. ఆ భ‌వ‌నంలోనే ముర‌ళీకృష్ణ‌తోపాటు, అత‌ని కొడుకు రాజా కూడా చిక్కుకోవ‌డం, ప‌దేళ్ల ఆ బాలుడిని కాపాడుకునేందుకు ముర‌ళీ చేసే పోరాటం సినిమాకి కీల‌కం.  (Laatti Review) ఆ నేప‌థ్యంలో భావోద్వేగాలు పండించేందుకు ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నం చేసినా అది ఫ‌లితాన్నివ్వ‌లేదు.  ఆ పోరాటంలో ముర‌ళీ ఆయుధాల్ని ఉప‌యోగించిన విధానం మాత్రం ఆక‌ట్టుకుంటుంది. క‌థ‌, క‌థ‌నాల‌తో సంబంధం లేకుండా  మాస్‌,  యాక్షన్‌ని ఇష్ట‌ప‌డే సినీ ప్రియుల్ని మాత్రం ఈసినిమా ఆక‌ట్టుకునే అవ‌కాశాలున్నాయి.

 

ఎవ‌రెలా చేశారంటే: విశాల్‌ (Vishal)ని మ‌రోసారి యాక్ష‌న్ హీరోగా చూసే అవ‌కాశం ల‌భించింది. ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో ఒదిగిపోవ‌డం ఆయ‌న‌కి కొట్టిన‌పిండే. కానిస్టేబుల్ బాడీ లాంగ్వేజ్‌తో ప‌క్కాగా ఆ పాత్ర‌లో లీన‌మ‌య్యారు. (Laatti Review)  పోరాట ఘ‌ట్టాలు చాలా బాగా చేశారు.  కొన్ని రీస్కీ షాట్లు కూడా చాలా స‌హ‌జంగా చేశారు. సునైన పాత్ర‌లో బ‌లం లేదు. ఆమె తెర‌పై క‌నిపించేది కూడా కొన్ని స‌న్నివేశాల్లోనే. ప్ర‌భు పాత్ర‌కి ప్రాధాన్యం లేదు. విల‌నిజంలో బ‌లం లేదు. దాదా సూరా, ఆయ‌న కొడుకు వీరా శ‌క్తిమంతంగా క‌నిపించినా  ఆ పాత్ర‌ల్ని డిజైన్ చేసిన విధానంలో లోపాలు క‌నిపిస్తాయి. (Laatti Review)

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. యువన్ శంకర్ రాజా అందించిన పాట‌లు, నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది.  బాలసుబ్రమణ్యం, బాలకృష్ణ తోటల సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణంలో ఉన్న ఒకే భవనం చుట్టూ సాగే సుదీర్ఘ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది.  పీటర్ హెయిన్స్‌ కంపోజ్ చేసిన ఫైట్ సీక్వెన్స్ సినిమాకి కీల‌కం. దర్శకుడు ఎ వినోద్ కుమార్  కొన్ని సన్నివేశాలను సమర్థంగా న‌డిపించినా, అక్క‌డ‌క్క‌డా అత‌ని అనుభ‌వ‌రాహిత్యం క‌నిపిస్తుంది. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా ఆయ‌న చేసిన క‌స‌ర‌త్తులు చాల‌లేదు. వాటిలో కొత్త‌ద‌నం కూడా క‌నిపించ‌దు.

బలాలు: 👍 విశాల్ నటన; 👍 మాస్‌ను మెప్పించే పోరాట ఘట్టాలు; 👍 తండ్రీ తనయుల నేపథ్యం

బలహీనతలు: 👎 కొత్తదనం లేని కథ, కథనాలు; 👎 విలనిజంలో బలం లేకపోవడం

చివరిగా:  లాఠీ..  యాక్షన్ ప్రియులకి మాత్రమే(Laatti Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని