Vishwak Sen: ‘మహాసముద్రం’లో అందుకే నటించలేకపోయా: విశ్వక్‌సేన్‌

తానెందుకు ‘మహాసముద్రం’ సినిమాలో నటించలేకపోయారో హీరో విశ్వక్‌సేన్‌ తెలిపారు. ‘మంగళవారం’ సక్సెస్‌ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Published : 21 Nov 2023 20:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) ప్రధాన పాత్రలో దర్శకుడు అజయ్‌ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). నందితా శ్వేత, ప్రియదర్శి, అజయ్‌ ఘోష్, అజ్మల్‌ అమీర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనరావడంతో చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. ఆ ఈవెంట్‌కు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహాసముద్రం’లో తాను నటించకపోవడానికి కారణమేంటో తెలిపారు.

పెద్దోళ్లు అలా అన్నారు.. కుర్రాళ్లు సీక్వెల్‌ అడుగుతున్నారు: వెంకటేశ్‌

‘‘అజయ్‌ అన్నతో నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఆయన విభిన్నంగా ఆలోచిస్తాడు. ‘మంగళవారం’లో హీరోయిన్‌ను హీరో స్థాయిలో చూపించాడు. దర్శకుడితో (తరుణ్‌ భాస్కర్‌) డ్యాన్స్‌ చేయించాడు. తరుణ్‌ భాస్కర్‌ నాకు ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చిన రెండు రోజులకు అజయ్‌ ఫోన్‌ చేసి ఓ సినిమా కోసం నా ఫొటోలు పంపమని అడిగాడు. ‘ఈ నగరానికి..’లో సెలెక్ట్‌ అయ్యాననే ఆనందంలో ఆయనకు నేను ఫొటోలు పంపించలేదు. తన రెండో సినిమా ‘మహాసముద్రం’ కథ నాకు వినిపించాడు. డేట్స్‌ సర్దుబాటుకాకపోవడంతో నటించలేకపోయా. లుంగీ ధరించి, కత్తి పట్టుకుని యాక్షన్‌ చేయాలనే కోరిక ప్రస్తుతం నటిస్తున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’ చిత్రంతో నెరవేరుతోంది. అజయ్‌ దర్శకత్వంలోనూ లుంగీ కట్టుకుని, కత్తి పట్టుకోవాలనుంది. త్వరలోనే అది సాధ్యమవ్వాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

అజయ్‌ భూపతి మాట్లాడుతూ.. ‘‘ఆర్‌ఎక్స్‌ 100 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలనుకున్న సమయంలో మా బాస్‌, దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పిలిచి.. తానో సినిమా చేస్తున్నానని, అందులో నటింపజేసేందుకు కొత్త అయినా ఫర్వాలేదు ఓ హీరో కావాలని చెప్పారు. ‘వెళ్లిపోమాకే’ సినిమాలోని విశ్వక్‌ స్టిల్‌ ఒకటి నచ్చడంతో దాన్ని ఆయనకు పంపించా. అప్పటి నుంచి విశ్వక్‌తో పరిచయం ఉంది. ఆయన నట ప్రయాణం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ‘మంగళవారం’ విషయంలో.. ఇలాంటి విభిన్న కాన్సెప్ట్‌, హీరోయిన్‌ పాత్రను ప్రేక్షకులు స్వీకరిస్తారా, లేదా? అనే భయం ఉండేది. ఆడియన్స్‌ అప్‌డేట్‌ అయ్యారని సినిమా విడుదలైన తర్వాత అర్థమైంది. మహిళలంతా చూడాల్సిన సినిమా ‘మంగళవారం’ అని చాలామంది అంటున్నారు. అందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు