Chakda Xpress: అనుష్క ప్రధాన పాత్రలో మరో క్రికెటర్‌ బయోపిక్‌.. టీజర్‌ ఔట్‌

టీమ్‌ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్‌ ఝులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌ నటి, ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నటిస్తున్న కొత్త చిత్రం ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’‌...

Updated : 06 Jan 2022 12:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా జట్టు మాజీ కెప్టెన్‌ ఝులన్‌ గోస్వామి జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌ నటి, ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నటిస్తున్న కొత్త చిత్రం ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్’‌. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా విడుదలవుతున్న ఈ చిత్ర టీజర్‌ను అనుష్క సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ప్రధాన బౌలర్‌గానే కాకుండా ఎన్నో రకాలుగా సేవలందించిన ఝులన్‌ గోస్వామి పాత్రలో ఆమె నటిస్తున్నారు. టీమ్‌ఇండియా క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో ఝులన్‌ ఎటువంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. ఎన్ని కష్టాలను చవిచూశారనే కథాంశంతో వాస్తవిక పరిస్థితుల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు అనుష్క తెలిపారు. ఈ చిత్రాన్ని అనుష్క, ఆమె సోదరుడు కర్నేశ్‌ శర్మ నిర్మిస్తుండగా, ప్రొసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

‘ఇదెంతో ప్రత్యేకమైన చిత్రం. ఎన్నో త్యాగాలకోర్చిన అద్భుతమైన కథ. ‘చక్‌దా ఎక్స్‌ప్రెస్‌’ సినిమా.. టీమ్‌ఇండియా మహిళల జట్టు మాజీ సారథి ఝులన్‌ గోస్వామి నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. మహిళల క్రికెట్‌లో ఇది ఒక కనువిప్పు కలిగే చిత్రంగా నిలుస్తుంది. ఆమె క్రికెటర్‌ అవ్వాలని, ప్రపంచం ముందు భారత జట్టును సగర్వంగా నిలబెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఆడవాళ్లు క్రికెట్‌ గురించి ఆలోచించడానికి కూడా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సవాళ్ల నడుమ ఆమె క్రికెటర్‌గా ఎదిగి ఎలా రాణించారనేదే ఈ సినిమా. దీన్ని అద్భుతమైన సన్నివేశాలతో తీర్చిదిద్దుతున్నాం’ అని అనుష్క సుదీర్ఘ పోస్టు రాసుకొచ్చారు. కాగా, ఇప్పటికే టీమ్‌ఇండియా మహిళల క్రికెట్‌లో మిథాలీరాజ్‌ బయోపిక్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాప్సీ అందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు పురుషుల క్రికెట్‌లోనూ పలువురి ఆటగాళ్ల జీవిత కథలు ఇదివరకే తెరకెక్కిన సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు