Exit Polls2022: ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలపై కేజ్రీవాల్‌ రియాక్షన్‌ ఇదే..

గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election2022)తో పాటు దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల(MCD Polls)కు సంబంధించి పలు సర్వే సంస్థలు సోమవారం సాయంత్రం వెల్లడించిన ఎగ్జిట్‌ పోల్స్‌(Exit Polls)పై దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు.

Published : 07 Dec 2022 01:04 IST

దిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly Election2022)తో పాటు దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల(MCD Polls)కు సంబంధించి పలు సర్వే సంస్థలు సోమవారం సాయంత్రం ఎగ్జిట్‌ పోల్స్‌(Exit Polls) వెల్లడించిన అంచనాలపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) స్పందించారు. గుజరాత్‌లో ఫలితాలు సానుకూలంగానే ఉంటాయన్నారు. అక్కడ తమ పార్టీ కొత్తగా పోటీ చేసిందని.. భాజపాకు కంచుకోటైన గుజరాత్‌లో తమకు 15 నుంచి 20శాతం ఓట్ల గెలిస్తే  రావడమంటే..  చాలా గొప్ప విషయమన్నారు. అయినా ఓట్ల లెక్కింపు రోజు వరకు వేచి చూడాలన్నారు. అయితే, ఆ పార్టీ నేతలు మాత్రం సర్వేలు తప్పని తేలుతుందని.. ఆప్‌కు దాదాపు 100కు చేరువలో సీట్లు వస్తాయని ధీమా వ్యక్తంచేస్తున్నారు. దిల్లీ పురపాలక ఎన్నికల్లో ఆ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేయబోతున్నప్పటికీ.. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆప్‌ది ఫ్లాప్‌ షోనే అంటూ దాదాపు అన్ని సర్వేలూ ముక్తకంఠంతో పేర్కొన్న విషయం తెలిసిందే. 

మరోవైపు, దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్ల పునర్విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆప్‌ భారీ విజయంతో 15ఏళ్ల భాజపా పాలనకు చెక్‌ పెట్టనున్నట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువడటంపై కేజ్రీవాల్‌ హర్షం ప్రకటించారు. దిల్లీ ప్రజలకు ఆయన అభినందనలు  తెలిపారు.  దిల్లీ ఓటర్లు  తమ పార్టీపైనే విశ్వాసం ఉంచినట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ సూచిస్తున్నాయన్న ఆయన.. ఈ ఫలితాలనే తాము ఆశిస్తున్నామన్నారు. అసలైన ఫలితాల కోసం  (డిసెంబర్‌ 7) వరకు వేచి చూస్తున్నట్టు చెప్పారు.

గుజరాత్‌లో కమలదళం 117-151 మధ్య సీట్లు సాధించి ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ ముక్తకంఠంతో చెబుతున్నాయి. భాజపాకు చాలా దూరంలో కాంగ్రెస్‌ (16-51) రెండో స్థానానికి పరిమితం కానుండగా.. భాజపా పాలనకు చెక్‌ పెట్టాలన్న లక్ష్యంతో సర్వశక్తులూ ఒడ్డి పోరాడిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి (2-13)తీవ్ర నిరాశ ఎదురుకానుందని అంచనా వేశాయి. అంతేకాకుడా, ఆప్‌కు రెండంకెల సీట్లు రావడమూ గగనమేనని పేర్కొన్నాయి. మరోవైపు- హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో హోరాహోరీ ఉన్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీని కమలదళం సాధించగలదని ఎక్కువ సంస్థలు తమ ఎగ్జిట్‌ పోల్స్‌లో అంచనా వేయగా.. అక్కడ ఆప్‌ ప్రభావం అంతంతమాత్రమేనని పేర్కొన్నాయి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు