జగన్‌ మతిభ్రమించినట్లు వ్యవహరిస్తున్నారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మతిభ్రమించినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, భారాస నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

Published : 24 Sep 2023 04:43 IST

చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్‌ స్పందించాలి: మోత్కుపల్లి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మతిభ్రమించినట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, భారాస నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. శనివారం ఆయన ఎన్టీఆర్‌ ఘాట్‌ను సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘జగన్‌ రాక్షస పాలన చేస్తున్నారు. రాజధాని లేని రాజ్యాన్ని ఏలుతున్నారు. చంద్రబాబును ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేయించారు. 74 ఏళ్ల వ్యక్తిని అహంకారపూరితంగా జైల్లో పెట్టి తప్పు చేశారు. చంద్రబాబు ఎప్పుడూ ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదు. ఆయనకు ఏదైనా జరిగితే జగనే బాధ్యుడవుతారు. రాజకీయాలకు అతీతంగా.. ఆయన అరెస్టుకు నిరసనగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద దీక్ష చేస్తా. రెండు మూడు రోజుల్లో రాజమహేంద్రవరం వెళ్లి ఆయనను కలుస్తా. దళితులు అంటే జగన్‌కు లెక్కలేదు. ఆయన దళిత ద్రోహి. దళితులు తిరుగుబాటు చేయకముందే జగన్‌ క్షమాపణ చెప్పి, బేషరతుగా చంద్రబాబుని విడుదల చేయాలి’ అని పేర్కొన్నారు. నాడు చంద్రబాబు మంత్రివర్గంలో ఉన్న కేసీఆర్‌ సైతం స్పందించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని