రాజకీయ కక్షతోనే.. చంద్రబాబు అరెస్టు

రాజకీయ కక్షతోనే తెదేపా అధినేత చంద్రబాబును జగన్‌ ప్రభుత్వం అరెస్టు చేయించిందని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు.

Updated : 24 Sep 2023 06:29 IST

జగన్‌ పాలన హిట్లర్‌ను తలపిస్తోంది
ఎస్సీ, ఎస్టీ, బీసీలే వైకాపాను భూస్థాపితం చేయనున్నారు
విజయవాడ అఖిలపక్ష సమావేశంలో వక్తల ధ్వజం

ఈనాడు, అమరావతి - విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే: రాజకీయ కక్షతోనే తెదేపా అధినేత చంద్రబాబును జగన్‌ ప్రభుత్వం అరెస్టు చేయించిందని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అన్ని రాజకీయ, ప్రజా సంఘాలు కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జైభీమ్‌ భారత్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో తెదేపా, జనసేన, వామపక్ష పార్టీలు, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. జైభీమ్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్టు చేయడం చూస్తేనే.. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు. అక్రమ కేసులో చంద్రబాబు మాదిరిగానే త్వరలో లోకేశ్‌నూ అరెస్టు చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. తన మాట వినాల్సిందేనని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులపై జగన్‌ ఒత్తిడి తెస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఎవరినీ.. గొంతు తెరవనివ్వడం లేదనీ, జగన్‌ పాలన హిట్లర్‌ను తలపిస్తోందని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలే వచ్చే ఎన్నికల్లో వైకాపాను భూస్థాపితం చేయనున్నారని శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. వారం రోజుల్లో అన్ని పార్టీలతో మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అనంతరం పలు తీర్మానాలు ఆమోదించారు. తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించడం, వైకాపా నియంత పాలనను గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లడం, ప్రతిపక్ష పార్టీల నాయకులపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెనక్కి తీసుకోవడం, శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేయడంతో పాటు ప్రతి మండలంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాల నిర్వహించాలని నిర్ణయించారు. తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్‌ రఫి, జనసేన అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకురాలు అక్కినేని వనజ, సీపీఎం నాయకుడు మంతెన సీతారామ్‌, అమరావతి ఐకాస నేత పువ్వాడ సుధాకర్‌, నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.


విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు

జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు. జగన్‌ ఆనవాళ్లు లేని ప్రభుత్వం 2024లో ఏర్పడబోతోంది. బాబాయ్‌ హత్య కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. జగన్‌ను ఎదుర్కోవాలంటే ఎన్నికల్లో అందరూ ఐక్యంగా పోరాడాలి.

 జవహర్‌, మాజీ మంత్రి


జగన్‌ చేయని స్కామ్‌ లేదు..

రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోంది. విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహం పెట్టి దళితులకు మేలు చేస్తున్నట్లు మాయ చేస్తున్నారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లిన జగన్‌ లాంటి వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతున్నారు. గత నాలుగేళ్లలో జగన్‌ చేయని స్కామ్‌ లేదు. చంద్రబాబును ఎదుర్కోలేకే అక్రమ కేసు పెట్టి అరెస్టు చేశారు.

 కొమ్మారెడ్డి పట్టాభి, తెదేపా అధికార ప్రతినిధి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని