Kejriwal: భాజపాకు 27ఏళ్లు అవకాశమిచ్చారు.. మాకు ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆప్‌ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.  వల్సాద్‌లో ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ రోడ్‌షో నిర్వహించారు.

Published : 17 Nov 2022 01:10 IST

వల్సాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు(Gujarat Assembly election) సమీపిస్తుండటంతో ఆప్‌(AAP) ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఓటర్లను తమవైపు ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా బుధవారం వల్సాద్‌లో ఆ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) రోడ్‌షో నిర్వహించారు. భాజపాకు 27 ఏళ్ల పాటు అధికారం ఇచ్చిన గుజరాత్ ప్రజలు తమకూ ఓ అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆప్‌ను గెలిపిస్తే విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయడంతో పాటు పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్య సేవలందిస్తామని తద్వారా ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చారు.  అద్భుతమై పాఠశాలల నిర్మాణంతో పాటు 20వేల మొహల్లా క్లీనిక్‌లు ఏర్పాటు, 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు నెలకు రూ.3వేలు చొప్పున భృతి కల్పిస్తామన్నారు. 

మీ ప్రాణాలంటే వాళ్లకు లెక్కలేదు..

‘‘భాజపాకు 27ఏళ్లు అధికారం ఇచ్చారు.. మాకు ఐదేళ్లు ఇవ్వండి.  మా పనితీరు నచ్చకపోతే.. ఇంటికి పంపేయండి. భాజపాకు మీరిచ్చిన 27 ఏళ్లు తక్కువేమీ కాదు’’ అన్నారు. మోర్బీలో ఇటీవల తీగల వంతెన కూలి 135మంది మృతి చెందిన ఘటనను ప్రస్తావించిన కేజ్రీవాల్‌.. ఎలాంటి టెండర్లు లేకుండానే ఈ వంతెన రిపేరు పనులను ఓ గడియారం కంపెనీకి అప్పగించారని విమర్శించారు. ‘‘మీ ప్రాణాలంటే వాళ్లకు లెక్కలేదు. ఐదేళ్లలో మేం దిల్లీలో చేసినట్టు ఇక్కడ భాజపా ఎందుకు చేయడంలేదని అడుగుతున్నా. దిల్లీలో పేద, ధనికుల పిల్లలు కలిసి ఒకే తరగతి గదిలో కూర్చొని చదువుకుంటున్నారు. ఐఏఎస్‌ అధికారుల పిల్లలు, కూలీల పిల్లలు కలిసి ఒకే బెంచ్‌పై కలిసి కూర్చొని విద్యనభ్యసిస్తున్నారు. గుజరాత్‌ ప్రజలు ఎలాగైనా చివరకు తమకే ఓటు వేస్తారని భాజపా నేతలు అనుకొంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసినా ప్రయోజనంలేదు’’ అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.  

దాదాగిరీ చేయడం నాకు రాదు..

‘‘రాజకీయాలు ఎలా చేయాలో నాకు తెలియదు.. దాదాగిరీ చేయడం కూడా నాకు చేతకాదు. ఒకరిని దూషించడం తెలియదు. నేను చదువుకున్న వ్యక్తిని.. పనిచేయడమే నాకు తెలుసు. మీ సోదరుడిగా అడుగుతున్నా.. మాకు ఒకే ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి. భాజపాకు 27 ఏళ్లు ఇచ్చారు.. మాకు ఐదేళ్లు అవకాశం ఇచ్చి.. ఆపై మీరే చూడండి’’ అన్నారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని