Mamata Benerjee: బెంగాల్‌లో ఎన్నికలు.. గవర్నర్‌కు మమతా బెనర్జీ కౌంటర్‌

రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి పంచాయతీ ఎన్నికలను అడ్డుకోవాలని ప్రతిపక్షాలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని పశ్చిమ్‌బెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ విమర్శించారు. 

Published : 17 Jun 2023 01:48 IST

కోల్‌కతా: పశ్చిమ్‌బెంగాల్‌లో (WestBengal) వచ్చే నెలలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ అనుకున్నట్లే ప్రశాంతంగా పూర్తయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Benerjee) తెలిపారు. గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ (CV Ananda Bose) ఊహించినట్లుగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోలేదని చెప్పారు. గురువారం దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భంగర్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘర్షణలతో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని, అది వీధి గూండాలు చేసిన పని అని ఆమె అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,317 పంచాయతీలకు నిర్వహిస్తున్న ఎన్నికలకు నిన్నటితో నామినేషన్‌ గడువు పూర్తయింది. మొత్తం 2.3 లక్షల మంది నామినేషన్లు దాఖలు చేయగా... అందులో తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులు 80 వేల మంది ఉన్నట్లు మమతా బెనర్జీ వెల్లడించారు. భంగర్‌ ఘర్షణలపై గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ స్పందిస్తూ..‘‘పోలైన ఓట్ల ఆధారంగా ఎన్నికల్లో విజయం ఉంటుంది. అంతేగానీ, ఎంత మంది చనిపోయారన్న దాన్నిబట్టి కాదు’ అని వ్యాఖ్యానించారు. దీనిపై  భంగర్‌ సమీపంలో నిర్వహించిన ఓ సమావేశంలో మమత స్పందిస్తూ.. రాష్ట్రంలో ఘర్షణ వాతావరణమే ఉంటే.. లక్షల నామినేషన్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

లబ్ధి కోసం అడ్డంకులు సృష్టిస్తున్నారు

భంగర్‌ ప్రాంతంలో జరిగిన అల్లర్లతో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదని మమతా బెనర్జీ అన్నారు. ఇది ఎన్నికలు జరగకూడదని భావిస్తున్న కొందరు వీధి గూండాలే హింసను సృష్టించారన్నారు. ఘర్షణల కారణంగా తాము నామినేషన్‌ వేయలేకపోయామని చెబుతున్న వారంతా.. 2 లక్షలకుపైగా నామినేషన్లు దాఖలైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, ఎన్నికలను అడ్డుకోవాలని భాజపా, కాంగ్రెస్‌, సీపీఐ (ఎం) భావిస్తున్నాయని మమతా బెనర్జీ విమర్శించారు. పంచాయతీ ఎన్నికలకు ఇంత పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైన రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా? అని ఆమె ప్రశ్నించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగబోతుంటే.. అడ్డంకులు సృష్టించి లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.

కేంద్రం ఓ కారణం వెతుకుతోంది

కేంద్ర బలగాలను రాష్ట్రంలో మోహరించేందుకు భాజపా ప్రభుత్వం ఓ కారణం వెతుకుతోందని మమతా బెనర్జీ విమర్శించారు. ఇటీవల మణిపుర్‌లోనూ కేంద్రం తన బలగాలను మోహరించిందని.. ఆందోళనకారులు, బలగాల మధ్య కాల్పుల్లో దాదాపు 150 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఇదే ఘర్షణల్లో తాజాగా కేంద్ర మంత్రి ఇల్లు కూడా దగ్ధమైన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అదే పరిస్థితిని పశ్చిమ్‌బెంగాల్‌లోనూ తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు. 2003 పంచాయతీ ఎన్నికల సమయంలోనూ పశ్చిమ్‌బెంగాల్‌లో కేంద్రబలగాలను మోహరించడంతో 70 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు జులై 11న ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని