Pawan Kalyan: ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం: పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Updated : 17 Mar 2024 20:51 IST

చిలకలూరిపేట: రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు.

‘‘అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకానికి నరేంద్రమోదీ రాక బలాన్నిచ్చింది. ఎన్డీయే పునర్‌ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చింది. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోదీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం. 2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోంది. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే ఆయన వచ్చారు. అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోంది.

రామరాజ్యం స్థాపన జరుగబోతోంది..

ముఖ్యమంత్రి జగన్‌ ఒక సారా వ్యాపారిగా మారారు. దేశమంతా డిజిటల్‌ ట్రాన్సక్షన్‌ చేస్తుంటే.. ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతం ఉండగా.. ఈరోజు -3 శాతానికి దిగజారిపోయింది. అయోధ్యలో రామాలయం కట్టిన మోదీకి .. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసుడిని తీసేయటం కష్టం కాదు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్‌ విర్రవీగుతున్నారు. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోదీ.. ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారు. రామరాజ్యం స్థాపన జరుగబోతోంది. ధర్మానిదే విజయం.. పొత్తుదే గెలుపు.. కూటమిదే పీఠం’’ అని పవన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని