ధోనీని బెదిరిస్తారా?: అఫ్రిది

టీమిండియా మాజీ సారథి, చెన్నై కెప్టెన్‌ ధోనీ, అతడి కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న బెదిరింపులపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది స్పందించాడు. భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాలకు చేర్చిన ధోనీపై...

Published : 13 Oct 2020 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా మాజీ సారథి, చెన్నై కెప్టెన్‌ ధోనీ, అతడి కుటుంబంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న బెదిరింపులపై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది స్పందించాడు. భారత క్రికెట్‌ను అత్యున్నత శిఖరాలకు చేర్చిన ధోనీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నాడు. ‘‘ధోనీ, అతడి కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు వస్తున్నాయో నాకు తెలియదు. కానీ అలా చేయడం సరికాదు. అవి జరగకూడదు కూడా. భారత క్రికెట్‌ను ధోనీ అత్యున్నత శిఖరాలకు చేర్చాడు. ఎంతో మంది జూనియర్‌, సీనియర్‌ ఆటగాళ్లను తన ప్రయాణంలో తీసుకెళ్లాడు. అలాంటి అతడిపై బెదిరింపులు చేయడం భావ్యం కాదు’’ అని షాహిద్‌ అఫ్రిది పేర్కొన్నాడని పాక్‌ మీడియా తెలిపింది.

యూఏఈ వేదికగా జరుగుతున్న లీగ్‌లో చెన్నై జట్టు ప్రదర్శన పేలవంగా ఉన్న సంగతి తెలిసిందే. 7 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. గతంలో మాదిరిగా ధోనీ ఫినిషర్‌గా అలరించలేకపోతున్నాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ధోనీ, అతడి కుటుంబంపై కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై అఫ్రిదితో సహా పలువురు క్రికెటర్లు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఘనతలు సాధించిన ధోనీ, అతడి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ధోనీ కుమారై జీవాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ బాలుడి (16)ని రాంచీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని