బ్యాటర్లూ... భయపడటం ఆపండి: పాంటింగ్‌

టీమ్‌ఇండియాతో రెండో టెస్టులో చెత్తగా ఆడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ తీవ్రంగా విమర్శించాడు. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం తెగువ చూపలేదన్నాడు. తొలుత వారు ఔటవుతారన్న భయం నుంచి బయటపడాలని...

Published : 30 Dec 2020 01:46 IST

మెల్‌బోర్న్‌: టీమ్‌ఇండియాతో రెండో టెస్టులో చెత్తగా ఆడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఆ జట్టు మాజీ సారథి రికీ పాంటింగ్‌ తీవ్రంగా విమర్శించాడు. భారత బౌలర్లను ఎదుర్కొనేందుకు ఏమాత్రం తెగువ చూపలేదన్నాడు. తొలుత వారు ఔటవుతారన్న భయం నుంచి బయటపడాలని సూచించాడు. ఈ మ్యాచ్‌ ముగిశాక ఆయన మీడియాతో మాట్లాడాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో పోరులో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అడిలైడ్‌లో ఘోర ఓటమికి ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకుంది.

‘అడిలైడ్‌లో ఆసీస్‌ 191 పరుగులే చేసింది. ఇక్కడ (మెల్‌బోర్న్‌) 195; 200కు పరిమితమైంది. ఇది టెస్టు క్రికెట్‌ బ్యాటింగ్‌ కాదు. అందులోనూ ఆ మాత్రం పరుగులు చేసేందుకు వారెంత సమయం తీసుకుంటున్నారనేదే బాధాకరం. ఆటగాళ్లు మరింత తీవ్రత చూపించాలి. ఔటవుతారని భయపడొద్దు. క్రీజులోకి వెళ్లి బ్యాటుతో పరుగులు చేయాలి. ఓవర్‌కు రెండున్నర కన్నా ఎక్కువ పరుగులు చేయాలి. అడిలైడ్‌, మెల్‌బోర్న్‌లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఓవర్‌కు రెండున్నర పరుగుల చొప్పున చేశారు. ఓడిపోయిన గత సిరీసులోనూ అంతే’ అని పాంటింగ్‌ అన్నాడు.

ఆసీస్‌ బ్యాటర్లు ఎలా ఆడుతున్నారో ఒకసారి చూసుకోవాలని రికీ హితవు పలికాడు. ‘టెస్టులంటేనే భాగస్వామ్యాలు. ఈ రెండు మ్యాచుల్లోనూ అలాంటివేమీ లేవు. ప్రస్తుతం స్టీవ్‌స్మిత్‌ ఫామ్‌లో లేడు. వార్నర్‌ అందుబాటులో లేడు. లుబుషేన్‌ 40+ స్కోరు చేస్తున్నా భారీ స్కోర్లుగా మలచడం లేదు. వార్నర్‌ త్వరగా జట్టులో చేరాలి. స్మిత్‌ పరుగులు చేయడం ఆరంభించాలి. గత వేసవిలోని ఫామ్‌ను లబుషేన్‌ అందుకోవాలి. ఆసీస్‌కు వీరంతా రాణించడం అవసరం’ అని పాంటింగ్‌ అన్నాడు.

ఇవీ చదవండి
కంగారూలకు అప్పుడే షాకిచ్చాడు.. 
నోళ్లు మూయించిన రహానె సేన

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని