India vs Nepal: భారత్‌ను వెంటాడుతున్న వర్షం.. నేపాల్‌తో మ్యాచ్‌ జరుగుతుందా..?

ఆసియా కప్‌లో భాగంగా భారత్, నేపాల్ (India vs Nepal) మధ్య జరిగే మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశముంది. 

Updated : 03 Sep 2023 16:55 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో భారత్ మ్యాచ్‌లకు వరుణుడు కరుణించేలా లేడు. పాకిస్థాన్‌ మ్యాచ్‌తో అసలుసిసలు మజాను ఆస్వాదిద్దామనుకున్న అభిమానుల ఆశలపై వరుణుడు నీళ్లు చల్లిన సంగతి తెలిసిందే. పల్లెకెలె వేదికగా దాయాదుల మధ్య జరిగిన పోరులో రెండుసార్లు వర్షం అంతరాయాల నడుమ భారత్ 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం వరుణుడు మరోసారి ఆటంకం కలిగించడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమవ్వకుండానే మ్యాచ్ రద్దయింది. రేపు (సెప్టెంబరు 4న) భారత్‌, నేపాల్  (India vs Nepal) మధ్య జరగాల్సిన మ్యాచ్‌కూ వర్ష ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్‌ కూడా పల్లెకెలె వేదికగానే జరగాల్సి ఉంది. అయితే, మ్యాచ్‌ జరిగే రోజు 80 శాతం వర్షం పడే అవకాశాలున్నాయి. వర్షం ప్రభావంతో టాస్‌ కూడా ఆలస్యమయ్యే ఛాన్స్‌ ఉంది. మ్యాచ్‌ జరిగే సమయంలో పలుమార్లు జల్లులు కురిసి ఆటకు అంతరాయం ఏర్పడే అవకాశముంది. 

విరాట్ కోహ్లీ, రోహిత్ బౌల్డ్‌.. ఎవరి వికెట్‌ను ఎంజాయ్‌ చేశానంటే?: షహీన్‌

ఈ మ్యాచ్‌ కూడా రద్దయితే భారత్ పరిస్థితి?

వర్షం కారణంగా భారత్‌, పాక్‌ మ్యాచ్‌ రద్దు కావడంతో ఇరుజట్లు చెరో పాయింట్ పంచుకున్నాయి. గ్రూప్‌ ఎలో పాకిస్థాన్ ఒక విజయం (నేపాల్‌పై), ఒక పాయింట్‌తో కలిపి సూపర్‌-4కు దూసుకెళ్లింది. నేపాల్‌తో మ్యాచ్‌ జరిగితే భారత్‌ విజయం లాంఛనమే. ఒకవేళ వరుణుడి ఆటంకంతో భారత్, నేపాల్ మ్యాచ్‌ కూడా రద్దయితే రెండు పాయింట్లతో టీమ్‌ఇండియా సూపర్-4కు అర్హత సాధించి నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. సూపర్‌-4లో భాగంగా సెప్టెంబరు 10న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ మరోసారి తలపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని