WTC Final: అశ్విన్‌ తుది జట్టులో ఉంటాడా... లేదా? ఆస్ట్రేలియా శిబిరంలో ఇదే హాట్‌ టాపిక్‌!

టీ20లను ఆస్వాదించిన క్రికెట్ అభిమానుల కోసం టెస్టు పోరు సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో ఆస్ట్రేలియా - భారత్ (AUS vs IND) జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final) మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా తుది జట్టులో ఎవరుంటారనేదానిపై ఆసీస్‌ తీవ్రంగా చర్చిస్తోంది.

Published : 02 Jun 2023 14:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ టెస్టు రారాజుగా తేల్చే టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ (WTC Final) ప్రారంభానికి మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది. జూన్ 7వ తేదీ నుంచి ఆస్ట్రేలియా - భారత్ జట్ల  మధ్య ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్ర సాధన చేసేస్తున్నారు. ఈ క్రమంలో భారత తుది జట్టులో ఎవరు ఉంటారనే దానిపై ఆసీస్ శిబిరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఓవల్‌ మైదానం పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. అందుకే, టీమ్‌ఇండియా తుది జట్టులో ఒక స్పిన్నర్‌కే స్థానం కల్పిస్తుందనే అభిప్రాయంతో ఆసీస్‌ ఉంది. దీనిపై ఆస్ట్రేలియా సహాయక కోచ్ డానియల్‌ వెటోరీ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత్‌ తరఫున  తుది జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌ ఆడకపోవచ్చని పేర్కొన్నాడు. బెక్‌హామ్‌లోని  కౌంటీ క్రికెట్‌ స్టేడియంలో ఆసీస్‌ ట్రైనింగ్‌ సెషన్‌ జరిగింది. ఈ సందర్భంగా డానియల్‌ వెటోరీ మాట్లాడాడు. 

జడ్డూనే బెటర్‌..

భారత్ ఎలాంటి బౌలింగ్‌ ఎటాక్‌తో బరిలోకి దిగనుందనే దాని గురించి మేం చర్చించాం. జడేజా తప్పకుండా జట్టులో ఉంటాడని భావిస్తున్నా. బౌలింగ్‌లో మాత్రమే కాకుండా బ్యాటింగ్‌లోనూ అదనపు బలంగా మారతాడు. ఆరో స్థానంలో కీలకమవుతాడు. అశ్విన్‌ అద్భుతమైన బౌలర్‌. ఏ జట్టైనా ఇలాంటి ఆటగాడిని తీసుకోవడానికే తొలుత మొగ్గు చూపుతుంది. అయితే, ఈసారి మాత్రం టీమ్‌ కాంబినేషన్‌ ప్రకారం తుది జట్టులో అవకాశం కష్టం. ఓవల్ పిచ్‌ బాగుంది. రోజులు గడిచే కొద్దీ స్పిన్నర్లకు అనుకూలంగా మారొచ్చు. కానీ, ఇద్దరు స్పిన్నర్లు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఓవల్‌ పిచ్‌ మొదట పేస్‌కు సహకరిస్తుంది. ముగ్గరు పేసర్లు కాకుండా భారత్ నాలుగో ఫాస్ట్‌ బౌలర్‌తో బరిలోకి దిగుతుందో లేదో చూడాలి. ఆ జట్టులో ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ ఉన్నాడు. దీంతో జడేజాతోపాటు శార్దూల్‌కు తుది జట్టులో అవకాశం రావొచ్చు.  

గ్రీన్‌ కీలకం..

మా జట్టులో పేస్ ఆల్‌రౌండర్‌ కామెరూన్ గ్రీన్ కీలక పాత్ర పోషిస్తాడు. ఐపీఎల్‌లోనూ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. గ్రీన్‌ సన్నద్ధత కూడా ఉన్నతస్థాయిలో ఉంటుంది.  గ్రీన్‌ ఇప్పటికే చాలా ఉత్తమ క్రికెట్ ఆడాడు. తప్పకుండా పుంజుకొని నాణ్యమైన ప్రదర్శన ఇస్తాడని భావిస్తున్నా. చాలా మంది క్రికెటర్లు విరామం తీసుకోవడం లేదా టీ20 గేమ్‌ ఆడటం జరిగింది. వీరిని మళ్లీ టెస్టు మోడ్‌లోకి తీసుకురావడమే కష్టమైన సవాల్’’ అని వెటోరీ తెలిపాడు. 

అశ్విన్‌ రికార్డు ఇదీ..

భారత్‌ వేదికగా జరిగిన బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో అశ్విన్‌ 25 వికెట్లు తీయగా.. జడేజా 22 వికెట్లు తీశాడు. దీంతో భారత్ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆసీస్‌పైనా మంచి రికార్డు అశ్విన్‌ సొంతం. అలాగే ఇంగ్లాండ్‌ పిచ్‌లపై ఏడు టెస్టుల్లో అశ్విన్‌ 18 వికెట్లు తీశాడు. డబ్ల్యూటీసీ రేసులో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌ అశ్విన్‌. ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో 61 వికెట్లు తీశాడు. దీంతో అశ్విన్‌ ఆడితే తమ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందనేది ఆసీస్‌ కోచింగ్‌ సిబ్బంది భావనగా ఉందని నెట్టింట కామెంట్లు వస్తున్నాయి. అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుందా..? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు