SA vs BAN: మహ్మదుల్లా ఒంటరి పోరాటం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా

ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా నాలుగో విజయాన్ని అందుకుంది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను సఫారీలు చిత్తుగా ఓడించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది.

Updated : 24 Oct 2023 22:32 IST

ముంబయి: వన్డే ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా నాలుగో విజయాన్ని అందుకుంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను సఫారీలు చిత్తుగా ఓడించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా పేసర్ల ధాటికి బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. దీంతో సౌతాఫ్రికా 149 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లా జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మహ్మదుల్లా (111; 111 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. లిట్టన్ దాస్ (22), తాంజిద్ హసన్ (12), నజ్ముల్ శాంటో (0), షకీబ్ అల్ హసన్ (1), ముష్పీకర్ రహీమ్ (8), హసన్ మిరాజ్ (11), నసుమ్ అహ్మద్ (19), హసన్ మహమూద్ (15), ముస్తాఫిజుర్ (11) విఫలమయ్యారు. ఒక దశలో 58 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన బంగ్లా.. మహ్మదుల్లా పోరాటంతో ఆ మాత్రం స్కోరైనా చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ఆరో స్థానంలో వచ్చిన మహ్మదుల్లా నిలకడగా బౌండరీలు బాది 104 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ 3, మార్కో జాన్సన్, కగిసో రబాడ, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహరాజ్‌ ఒక వికెట్ తీశాడు. 

లక్ష్యఛేదనలో బంగ్లా మొదటి ఆరు ఓవర్లు నిలకడగానే ఆడింది. అప్పటికి వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. మార్కో జాన్సన్‌ వేసిన ఏడో ఓవర్‌ నుంచి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ గాడితప్పింది. జాన్సన్‌ వరుస బంతుల్లో తాంజిద్‌ హసన్‌, శాంటోలను పెవిలియన్‌కు పంపాడు. వీరిద్దరూ వికెట్ కీపర్ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చారు. తర్వాత వచ్చిన షకీబ్‌ను పేసర్ లిజాడ్ విలియమ్స్ ఔట్‌ చేశాడు. కొద్దిసేపటికే ముష్పీకర్‌ను కొయిట్జీ వెనక్కి పంపాడు. లిట్టన్ దాస్‌ను రబాడ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో హసన్ మిరాజ్ పెవిలియన్‌ చేరాడు. నసుమ్‌ అహ్మద్‌.. కోయిట్జీకి రిట్నర్ క్యాచ్‌ ఇచ్చాడు. మహమూద్‌ను రబాడ వెనక్కి పంపాడు. ఈ క్రమంలో క్రీజులోకి పాతుకుపోయిన మహ్మదుల్లా.. ముస్తాఫిజుర్ సహకారంతో శతకం అందుకున్నాడు. సెంచరీ చేసిన మహ్మదుల్లా.. కోయిట్జీ బౌలింగ్‌లో మార్కో జాన్సన్‌కు చిక్కాడు. విలియమ్స్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో ముస్తాఫిజుర్.. మిల్లర్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో బంగ్లా ఆలౌటైంది.  

సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (174; 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లు) భారీ శతకం బాదాడు. ఈ ప్రపంచకప్‌లో అతడికిది మూడో శతకం. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ (90; 49 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. డేవిడ్ మిల్లర్ (34*; 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) కూడా దూకుడుగా ఆడాడు. చివర్లో డికాక్‌, క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించారు. దీంతో చివరి 13 ఓవర్లలో సౌతాఫ్రికా 174 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లలో హసన్ మహమూద్‌ 2, షోరిఫుల్, హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు