CWC Qualifiers: వెస్టిండీస్‌కు షాకిచ్చిన జింబాబ్వే

స్టార్‌ ఆటగాళ్లున్న వెస్టిండీస్‌కు జింబాబ్వే షాకిచ్చింది. వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో విండీస్‌ను  ఆతిథ్య జట్టు 35 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్‌-ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

Updated : 24 Jun 2023 21:46 IST

హరారే: స్టార్‌ ఆటగాళ్లున్న వెస్టిండీస్‌కు జింబాబ్వే షాకిచ్చింది. వన్డే ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో విండీస్‌ను ఆతిథ్య జట్టు 35 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్‌-ఏలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. జింబాబ్వేకు వరుసగా ఇది మూడో విజయం. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. లక్ష్యఛేదనలో కరేబియన్‌ జట్టు 233 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ ఆటగాళ్లలో కైల్ మేయర్స్‌ (56), రోస్టన్ ఛేజ్ (44), నికోలస్‌ పూరన్‌ (34), షైయ్‌ హోప్‌ (30) పరుగులు చేశారు. టెండై చతర 3, ముజారబానీ, నగరవ, సికిందర్‌ రజా రెండేసి వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించారు.  

జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్‌ రజా (68; 58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర్యాన్ బర్ల్ (50) అర్ధ శతకాలు బాది జట్టు మంచి స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు. క్రెయిగ్ ఎర్విన్ (47) త్రుటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. విండీస్‌ బౌలర్లలో కీమ్‌ పాల్‌ 3, అల్జారీ జోసెఫ్‌, అఖిలా హోస్సెన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

నేపాల్‌పై నెదర్లాండ్స్‌ సునాయాస విజయం

గ్రూప్‌-ఏలోనే నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత నెదర్లాండ్స్‌ బౌలర్ల ధాటికి నేపాల్ 167 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని నెదర్లాండ్స్ 27.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  నెదర్లాండ్స్‌ ఓపెనర్‌ మాక్స్ ఓడౌడ్ (90; 75 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. బాస్ డి లీడే (41), విక్రమ్‌ జిత్ సింగ్ (30) పరుగులు చేశారు. నేపాల్‌ బ్యాటర్లలో రోహిత్ పాడెల్ (33) టాప్‌ స్కోరర్‌. కుశాల్ భుర్టెల్ (27), సందీప్ లామిచానే (27) పరుగులు చేశారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లోగాన్ వాన్ బీక్ 4, బాస్ డి లీడే, విక్రమ్‌జిత్‌ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని