David Warner : అక్షర్‌ పటేల్‌తో ఎందుకు బౌలింగ్ వేయించలేదంటే.. : డేవిడ్‌ వార్నర్‌

గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌(Axar Patel)తో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌(David Warner) ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ చేయించకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై కెప్టెన్‌ వివరణ ఇచ్చాడు.

Updated : 05 Apr 2023 12:13 IST

ఇంటర్నెట్‌డెస్క్‌ :  ఐపీఎల్‌(IPL 2023)లో ఛాంపియన్‌ జట్టు గుజరాత్‌ టైటాన్స్‌(Gujarat Titans) తన హవాను కొనసాగిస్తోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇక దిల్లీ(Delhi Capitals ) వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాట్‌తో రాణించిన దిల్లీ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(Axar Patel)తో ఆ తర్వాత ఒక్క ఓవరు కూడా బౌలింగ్‌ చేయించకపోవడం విస్మయం కలిగించింది. డేవిడ్‌ వార్నర్‌(David Warner) నిర్ణయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై మ్యాచ్‌ అనంతరం వార్నర్‌ స్పందించాడు.

‘నా నిర్ణయం ఆశ్చర్యకరమేమీ కాదు.  పిచ్‌పై ఊహించినదాని కంటే ఎక్కువ స్వింగ్‌ ఉంది. మరోవైపు తక్కువ ఎత్తులో బంతి గమనం ఉంటోంది. పరిస్థితులను ఎలా అన్వయించుకోవాలో ఇది తెలియజేస్తోంది. ఇక్కడ మరో 6 మ్యాచ్‌లు ఉన్నాయి. మొదటి కొన్ని ఓవర్లలో ఆ స్వింగ్‌ ఆశించాలి. ఇక గుజరాత్‌లో సాయి బాగా ఆడాడు. మిల్లర్‌ తన పాత్రకు న్యాయం చేకూర్చాడు. డ్యూ కూడా వాళ్లకు సహకరించింది. ఈ పిచ్‌పై 180-190 పరుగులు చేయకపోతే  లక్ష్యాన్ని కాపాడుకోవడం సవాలే’ అని వార్నర్‌ వివరించాడు.

ఇక ఈ మ్యాచ్‌లో మొదట దిల్లీ 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అక్షర్‌ పటేల్‌ (36; 22 బంతుల్లో 2×4, 3×6) మెరిశాడు. గత మ్యాచ్‌లో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’గా ఆడి, ఈసారి తుది జట్టులోకి వచ్చిన తమిళనాడు కుర్రాడు సాయి సుదర్శన్‌ (62 నాటౌట్‌; 48 బంతుల్లో 4×4, 2×6) కీలక ఇన్నింగ్స్‌ ఆడడంతో గుజరాత్‌ 6 వికెట్ల తేడాతో దిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని