T20 League: ధోనీ వద్దన్న పని చేసినందుకు చీవాట్లు పడ్డాయ్‌.. కానీ!

ఈశ్వర్‌ పాండే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టలేదు కానీ భారత టీ20 లీగ్‌లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టీ20 లీగ్‌లో 2013-15 మధ్య 25 మ్యాచ్‌లు ఆడిన..

Published : 15 Sep 2022 02:08 IST

ఆనాటి సంఘటనను గుర్తు చేసుకొన్న చెన్నై బౌలర్‌

అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గానే క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఈశ్వర్‌ పాండే

(ఫొటోసోర్స్‌: ఈశ్వర్‌పాండే ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: ఈశ్వర్‌ పాండే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టలేదు కానీ భారత టీ20 లీగ్‌లో చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టీ20 లీగ్‌లో 2013-15 మధ్య కాలంలో 25 మ్యాచ్‌లు ఆడిన పాండే 18 వికెట్లు తీశాడు. 75 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 263 వికెట్లు పడగొట్టాడు. అయితే జాతీయ జట్టులోకి రావాలనే కోరిక మాత్రం నెరవేరలేదు. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గానే తన క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు చెప్పేశాడు. అయితే చెన్నై జట్టులో ధోనీ నాయకత్వాన ఆడినప్పుడు చోటు చేసుకున్న పలు విషయాలను వెల్లడించాడు. అప్పుడు భారత సారథిగా ఉన్న ధోనీ తనను జాతీయ జట్టులోకి తీసుకొని ఉంటే తన క్రికెట్‌ జీవితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అప్పుడు తన వయసు 23-24 మధ్యే ఉండటం, మంచి ఫిట్‌నెస్‌తో కలిగి ఉన్నట్లు వివరించాడు. ఒక్క ఛాన్స్‌ ఇచ్చి ఉంటే కెరీర్‌ను ఉన్నతస్థాయికి తీసుకెళ్లగలిగేవాడినని పేర్కొన్నాడు. అలాగే బెంగళూరుతో ఆడేటప్పుడు ధోనీతో జరిగిన సంఘటనను గుర్తు చేసుకొన్నాడు. 

‘‘భారత టీ20 లీగ్‌లో భాగంగా ఓ సారి బెంగళూరుతో మ్యాచ్‌ ఆడేటప్పుడు ఓ తమాషా సంఘటన చోటు చేసుకుంది. ఏబీ డివిలియర్స్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పుడు నాకు బంతిని అందిస్తూ ధోనీ ఓ మాట చెప్పాడు. ‘ఏబీడీకి యార్కర్‌ మాత్రం వేయొద్దు’ అని అన్నాడు. ఓ నాలుగు బంతులు కొట్టనీయకుండా బంతులను వేశా. కానీ ఐదోబంతిని యార్కర్‌గా ప్రయత్నించా. దానిని ఏబీడీ బౌండరీగా మార్చాడు. ఆ సందర్భంలో ధోనీ మళ్లీ నా దగ్గరకు వచ్చి సరదాగా చీవాట్లు పెట్టాడు. చివరి బాల్‌ను యార్కర్‌గా వేయొద్దన్నాడు. అయితే యార్కర్‌గా కాకుండా అది తక్కువ ఎత్తులో ఫుల్‌టాస్‌గా పడింది. ఆ బంతికి ఏబీడీ ఔటయ్యాడు’’ అని ఈశ్వర్‌ పాండే వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని