IND vs ENG: కోహ్లీ ఆడనంత మాత్రాన భారత్‌కు నష్టం లేదు.. జీవితం ఆగిపోదు: మాజీ క్రికెటర్

ఐదు టెస్టుల సిరీస్‌లో (IND vs ENG) భారత్ - ఇంగ్లాండ్‌ 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్టు రాజ్‌ కోట్‌ వేదికగా 15న ప్రారంభం కానుంది. మిగతా టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది.

Updated : 11 Feb 2024 12:22 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టులకు (IND vs ENG) ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ లేడు. వ్యక్తిగత కారణాలతో సిరీస్‌ మొత్తానికి దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే. కోహ్లీ లేకపోవడం భారత్‌కు నష్టమేనని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేయగా.. టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా మాత్రం భిన్నంగా స్పందించాడు.

‘‘కోహ్లీ జట్టులో లేకపోయినా ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను భారత్ కోల్పోదని భావిస్తున్నా. నిజాయతీగా చెప్పాలంటే.. ఒకరు ఉన్నా, లేకపోయినా జీవితం ఆగిపోదు. విరాట్ లేడని కాస్త బాధ ఉండొచ్చు. ఆసీస్‌లో ఆ జట్టును ఓడించినప్పుడు కూడా అతడు లేడనే సంగతి గుర్తు పెట్టుకోవాలి. అడిలైడ్‌ టెస్టులో కోహ్లీ ఉండి కూడా మనం ఓడిపోయాం. గబ్బాలో ఎలా గెలిచామో అందరికీ తెలిసిందే.

హైదరాబాద్‌, వైజాగ్‌ టెస్టుల్లో విరాట్ ఉండుంటే ఏదొక మ్యాచ్‌లో కచ్చితంగా 150+ స్కోరు చేసేవాడు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎటాక్ వీక్‌గానే ఉంది. ఇలాంటి బౌలింగ్‌తో కోహ్లీని ఆపడం చాలా కష్టమయ్యేది. మరీ ముఖ్యంగా రెహాన్‌ అహ్మద్‌ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఓ సందర్భంలో కోహ్లీ ఆడి తన బౌలింగ్‌లో నాలుగు బౌండరీలు కొడితే బాగుండేదని రెహాన్‌ చెప్పాడు. కానీ, విరాట్ కేవలం నాలుగు బౌండరీలు కొట్టేసి వికెట్‌ ఇచ్చి వెళ్లడు. ఇంగ్లాండ్ జట్టులో షోయబ్‌ బషీర్, జాక్‌ లీచ్, టామ్ హార్ట్‌లీ ఉన్నాసరే కోహ్లీ మాత్రం 50-70 పరుగులతో ఆపడు. దానిని భారీ సెంచరీగా మలుస్తాడు. అందుకే, ఇతర బ్యాటర్లతో పోలిస్తే విరాట్ భిన్నంగా అనిపిస్తాడు’’ అని చోప్రా వ్యాఖ్యానించాడు.

జట్టులోకి తీసుకోకపోవడంపై ఉమేశ్‌ పోస్టు..

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో ఉమేశ్‌ యాదవ్‌కు అవకాశం దక్కలేదు. దీనిపై ఈ భారత సీనియర్ బౌలర్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘‘పుస్తకాలపై దుమ్ము పేరుకుపోయినంత మాత్రాన అందులో కథలు ముగిసినట్లు కాదు’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పెట్టాడు. దీంతో అతడి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ‘బీసీసీఐ తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయం ఇదే’. ‘జట్టులోకి వచ్చేందుకు అతడికి పూర్తి అర్హత ఉంది’ అంటూ స్పందనలు తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని