T20 WC 2024: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అతడే సారథ్యం వహించాలి: గంభీర్

వచ్చే ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచ కప్‌ (ODI World Cup 2024) జరగనుంది. ఇప్పట్నుంచే జట్లు తమ సన్నాహకాలను ప్రారంభించాయి. అందులో భాగంగా భారత్‌ కూడా ఆసీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమైంది.

Published : 23 Nov 2023 16:37 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) ముగిసింది. ప్రస్తుతం టీమ్ఇండియా ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను ఆడేందుకు సిద్ధమైంది. ఇదంతా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024) కోసం సన్నాహకంగా భావించాలి. ఆసీస్‌తో సిరీస్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా సూర్యకుమార్‌ను మేనేజ్‌మెంట్ నియమించింది. హార్దిక్‌ పాండ్య గాయం నుంచి కోలుకోకపోవడంతో సూర్యకు అవకాశం దక్కింది. అయితే, వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌లో మాత్రం టీమ్‌ఇండియాను రోహిత్ శర్మనే నడిపించాలని మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ సూచించాడు. అలాగే విరాట్ కోహ్లీని కూడా జట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నాడు. 

‘‘యూఎస్‌ఏ-వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇవ్వనున్న వరల్డ్‌ కప్‌ కోసం ప్రకటించే జట్టులో ఇద్దరు స్టార్లు ఉండాల్సిందే. విరాట్ కోహ్లీతోపాటు రోహిత్ శర్మను తీసుకోవాలి. అంతేకాకుండా భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం రోహిత్‌ శర్మకే ఇవ్వాలి. ఇప్పుడు హార్దిక్‌ పాండ్యనే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడని తెలుసు. కానీ, రోహిత్ అయితేనే బాగుంటుంది. ఇప్పుడు వన్డే ప్రపంచ కప్‌లో రోహిత్ సారథ్య పనితీరు అద్భుతం. పవర్‌ప్లేలో అతడి ఆటతీరు అమోఘం. అందుకే, టీ20ల్లోకి రోహిత్‌ను తీసుకోవాలి. అతడు జట్టులోకి వచ్చాడంటే కోహ్లీ కూడా వచ్చేస్తాడు. అయితే, రోహిత్‌ శర్మ టీ20 ప్రపంచకప్‌లో ఆడాలనే నిర్ణయం తీసుకోవాలి. అతడిని కేవలం బ్యాటర్‌గా మాత్రమే కాకుండా కెప్టెన్‌గానే ఎంపిక చేయాలి’’ అని గౌతమ్‌ గంభీర్‌ తెలిపాడు. 

గౌతమ్‌ గంభీర్‌ మాత్రం రోహిత్‌ను తీసుకోవాలని సూచనలు చేస్తున్నప్పటికీ హిట్‌మ్యాన్‌ మాత్రం గతేడాది నుంచి పొట్టి ఫార్మాట్‌లో ఆడలేదు. ఈ ఏడాదంటే వన్డే ప్రపంచకప్‌ కోసం టెస్టులతోపాటు 50 ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. రోహిత్‌ మళ్లీ టీ20లు ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం హిట్‌మ్యాన్‌కు 36 ఏళ్లు నిండాయి. ఈ దశలో తిరిగి టీ20 జట్టులోకి రావాలని, కుర్రాళ్ల అవకాశాలకు అడ్డంకిగా మారాలని అనుకోవట్లేదని బీసీసీఐ వర్గాల సమాచారం. అయితే జట్టు ప్రయోజనాల కోసం రోహిత్ తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటాడో లేదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని