Gambhir: డబ్బు కోసం అలాంటి ప్రకటనలా?.. క్రికెటర్లపై గంభీర్‌ ఫైర్

‘పాన్‌ మసాలా’ యాడ్‌లో నటించిన క్రికెటర్లపై భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ఫైరయ్యాడు.

Published : 15 Jun 2023 01:29 IST

ఇంటర్నెట్ డెస్క్: ‘పాన్‌ మసాలా’ యాడ్‌లో నటించిన క్రికెటర్లపై భారత మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) ఆగ్రహం వ్యక్తంచేశాడు. డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉండగా.. ‘పాన్ మసాలా’ బ్రాండ్ యాడ్‌లు చేయడం వల్ల వాటిని చూసే కోట్లాది మంది పిల్లలకు తప్పుడు సందేశం వెళ్తుందన్నాడు. ఇటీవల టీమ్‌ఇండియా మాజీ ఆటగాళ్లు సునీల్ గావాస్కర్, కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్‌తోపాటు విండీస్‌ స్టార్ క్రిస్‌ గేల్ ఓ ‘పాన్‌ మసాలా’ యాడ్‌లో నటించారు. వీరిని ఉద్దేశించి గంభీర్‌ ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘ఓ క్రికెటర్ పాన్ మసాలా యాడ్ చేస్తారని నా జీవితంలో ఊహించలేదు. ఇది చాలా అసహ్యంగా ఉంది. ఈ ప్రకటనల ద్వారా మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు?’’ అని గంభీర్‌ ప్రశ్నించాడు. అందుకే రోల్ మోడల్స్‌ను కాస్త జాగ్రత్తగా ఎంచుకోండంటూ అభిమానులకు సూచించాడు. ‘‘ఏ వ్యక్తయినా తాను చేసే పనితోనే గుర్తింపు పొందుతాడు. కోట్ల మంది పిల్లలు మిమ్మల్ని చూస్తుంటారు. అనుకరిస్తుంటారు. అలాంటప్పుడు పాన్ మసాలా యాడ్ చేయడం సరికాదు. డబ్బు సంపాదించడానికి ఎన్నో ఇతర మార్గాలు ఉన్నాయి. ఇలాంటివి చేసే కంటే ఆ డబ్బు వద్దని చెప్పే ధైర్యం మీకుండాలి’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు గంభీర్‌. 

2018 ఐపీఎల్‌లో గంభీర్‌ దిల్లీ డేర్‌డెవిల్స్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ఆ సీజన్‌లో దిల్లీ జట్టు పేలవమైన ప్రదర్శన చేయడంతో మధ్యలోనే సారథిగా బాధ్యతల నుంచి వైదొలిగాడు. అప్పుడు గంభీర్‌కు రూ.3 కోట్ల చెక్కు రావాల్సింది. ఆ డబ్బుకు తాను అర్హుడిని కాదని చెక్కుని తిరస్కరించాడు. ఆ విషయాన్ని ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నాడు. సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) గురించి మాట్లాడుతూ.. ‘సచిన్‌కు ఓ సారి పాన్ మసాలా యాడ్‌ చేయడానికి రూ.20-30 కోట్లు ఆఫర్ ఇచ్చారు. కానీ అతను నో చెప్పాడు. ఆల్కహల్, పొగాకు ఉత్పత్తుల బ్రాండ్స్‌ ప్రకటనలు చేయనని సచిన్ తన తండ్రికి మాటిచ్చాడు. అందుకే అతడో రోల్ మోడల్’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని