Rohit Sharma: ‘రోహిత్‌కు అసలు సిసలు పరీక్ష ముందుంది.. ఏ మాత్రం తేడా వచ్చినా’

రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. రోహిత్ అద్భుతమైన కెప్టెన్‌ అని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నాడు. అయితే, వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) రూపంలో అతడికి మరో 15 రోజుల్లో అసలు సిసలు పరీక్ష మొదలుకానుందని పేర్కొన్నాడు. 

Published : 19 Sep 2023 01:40 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది ఆసియా కప్‌ (Asia Cup 2023). ఈ టోర్నీ ఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించిన భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్‌ను దక్కించుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో భారత్‌కి రెండో ఆసియా కప్‌. 2018లోనూ అతడి సారథ్యంలో టీమ్‌ఇండియా (Team India) టైటిల్ సాధించింది. దీంతో కెప్టెన్‌గా ఉన్న రెండుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపి ఆసియా కప్‌ సక్సెస్ ఫుల్ కెప్టన్లలో ఒకడిగా అవతరించాడు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. రోహిత్ అద్భుతమైన కెప్టెన్‌ అని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదన్నాడు. అయితే, వన్డే ప్రపంచకప్‌ రూపంలో అతడికి మరో 15 రోజుల్లో అసలు సిసలు పరీక్ష మొదలుకానుందని పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శనలో ఏ మాత్రం తేడా వచ్చినా అతడు విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాడు. గతంలో విరాట్ కోహ్లీ, 2007లో రాహుల్ ద్రవిడ్‌కు ఇలాంటి అనుభవం ఎదురైందని గుర్తు చేశాడు. కానీ, ప్రస్తుతం ఉన్న భారత జట్టుకు  ప్రపంచకప్‌ ఫైనల్‌కు చేరే సత్తా ఉందని విశ్వాసం వ్యక్తం చేశాడు. 

సిరాజ్‌ మియా.. నీ మాయ అదిరిందయ్యా..!

‘‘రోహిత్‌ కెప్టెన్సీ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అతడు సారథిగా అయిదు ఐపీఎల్ టైటిల్స్‌ సాధించాడు. చాలామంది ఒక్కసారి కూడా జట్టును జట్టును ఛాంపియన్‌గా నిలపలేకపోయారు. కానీ, రోహిత్‌కు అసలు సిసలు పరీక్ష మరో 15 రోజుల్లో మొదలుకానుంది. ప్రస్తుతం జట్టులో 15-18 మంది అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆటగాళ్లున్నారు. ఒకవేళ వారు సరైన సమయంలో మంచి ప్రదర్శన చేయకపోతే అప్పుడు కెప్టెన్ రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై విమర్శలు మొదలవుతాయి. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రతి కెప్టెన్‌ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో విరాట్‌ కోహ్లీకి, 2007లో రాహుల్‌ ద్రవిడ్‌కి ఇలాంటి అనుభవం ఎదురైంది. ఒకవేళ ఈ సారి టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ సాధించడంలో విఫలమైతే రోహిత్‌ కూడా ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఉన్న జట్టుకు ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరే సత్తా ఉంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.

ఆసియా కప్‌ను దక్కించుకుని ఫుల్‌ జోష్‌లో ఉన్న టీమ్‌ఇండియా సెప్టెంబరు 22 నుంచి ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. అనంతరం ప్రపంచకప్‌ మొదలవుతుంది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌ కోసం ఇంకా భారత జట్టును ప్రకటించలేదు. వన్డే ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టునే ఈ సిరీస్‌కు కొనసాగించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని