Ancy SOJAN EDAPPILLY: తండ్రి కల కోసం

అతను అథ్లెటిక్స్‌లో రాణించాలనుకున్నాడు. దేశానికి పతకాలు అందించాలనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితులు అతణ్ని ఆపేశాయి.

Updated : 03 Oct 2023 07:04 IST

తను అథ్లెటిక్స్‌లో రాణించాలనుకున్నాడు. దేశానికి పతకాలు అందించాలనుకున్నాడు. కానీ కుటుంబ పరిస్థితులు అతణ్ని ఆపేశాయి. దీంతో బతుకుదెరువు కోసం ఆటోడ్రైవర్‌గా మారాడు. కానీ అథ్లెటిక్స్‌పై ప్రేమను మాత్రం వదల్లేదు. తనయను అథ్లెటిక్స్‌లో ఛాంపియన్‌గా చూడాలనుకున్నాడు. ఆ దిశగా చిన్నతనం నుంచే ఆమెను ప్రోత్సహించాడు. ఇప్పుడా అమ్మాయి ఆసియా క్రీడల్లో రజతం గెలిచింది. ఆమెనే ఆన్సీ సోజన్‌. తండ్రి సోజన్‌ ఈటీ కలను నిజం చేస్తూ సాగుతోంది ఈ మలయాళీ చిన్నది. తండ్రి ప్రోత్సాహంతో ఏడో తరగతిలో ఉండగానే ఆన్సీ అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టింది. మొదట్లో లాంగ్‌జంప్‌తో పాటు 100మీ. 200మీ, రిలే.. ఇలా స్ప్రింట్‌ విభాగాల్లోనూ పోటీపడేది. ఖేలో ఇండియా యూత్‌ క్రీడల్లో ఆమె 100మీ. 200మీ.పరుగు, లాంగ్‌జంప్‌, 4×100మీ. రిలేలో స్వర్ణాలు గెలవడం విశేషం. కానీ గాయాలు ఆమెకు అడ్డుకట్ట వేశాయి. 2018లో కుడి చీలమండ గాయం, 2021లో మడమ గాయం, కండరాల గాయం ఆన్సీని వేధించాయి. దీంతో స్ప్రింట్‌కు వీడ్కోలు పలికి 2022 నుంచి కేవలం లాంగ్‌జంప్‌పైనే ఆమె దృష్టి సారించింది. పూర్తిగా దీనిపైనే ధ్యాస పెట్టి తీవ్రంగా సాధన చేస్తోంది. గతంలో స్ప్రింట్‌లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆన్సీ తీవ్ర ఒత్తిడిలో ఉండేది. కానీ ఇప్పుడు లాంగ్‌జంప్‌ను ఆస్వాదిస్తూ, గాయాల బెడద కూడా లేకపోవడంతో పతకాల వేటలో దూసుకెళ్తోంది. లాంగ్‌జంప్‌లో జాతీయ అండర్‌-21 రికార్డు ఆన్సీదే. ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి, జాతీయ పోటీల్లో స్వర్ణాలతో సత్తాచాటింది. నిరుడు కామన్వెల్త్‌ క్రీడల్లోనూ కేరళకు చెందిన ఈ 22 ఏళ్ల అమ్మాయి పోటీపడింది. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పుడు తొలిసారి ఆసియా క్రీడల బరిలో దిగి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో వెండి పతకాన్ని ముద్దాడింది. పసిడి నెగ్గిన అథ్లెట్‌ కంటే కేవలం 0.10 మీటర్ల వెనుకబడి ఆన్సీ రెండో స్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు