Gautam Gambhir: అదే అత్యంత చెత్త సెలెక్షన్‌ కమిటీ: గంభీర్‌

ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త ప్యానెల్‌ అని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ విమర్శించాడు.

Updated : 23 Oct 2023 07:18 IST

దిల్లీ: ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త ప్యానెల్‌ అని మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ విమర్శించాడు. 2019 వన్డే ప్రపంచకప్‌కు జట్టును ఎంపిక చేసినప్పుడు సెలెక్షన్‌ కమిటీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. నాలుగో స్థానానికి అనుభజ్ఞుడైన అంబటి రాయుడు బదులు విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడం దుమారం రేపింది. ‘‘భారత క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త సెలెక్షన్‌ కమిటీ అది. అంబటి రాయుడు వంటి బ్యాటర్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడిని ప్రపంచకప్‌కు తీసుకెళ్లకుండా మరొకరికి అవకాశం ఇచ్చారు. నాలుగో స్థానమే అతిపెద్ద సమస్యగా ఉన్నప్పటికీ ఇలా చేశారు. అంబటి రాయుడును ఏడాదంతా ఆడించారు. కాని ప్రపంచకప్‌కు ముందు తప్పించారు. అందుకు కారణమేంటో ఎవరికీ తెలియదు’’ అని గంభీర్‌ పేర్కొన్నాడు.


ఫేవరెట్‌ భారత్‌: టేలర్‌

దిల్లీ: అన్ని అస్త్రాలతో చెలరేగుతున్న భారత్‌ స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భిన్నంగా కనిపిస్తోందని న్యూజిలాండ్‌ మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌ అన్నాడు. ‘‘సొంతగడ్డపై భారత్‌ భిన్నమైన జట్టు. ప్రపంచకప్‌ను భారత్‌ గొప్పగా ప్రారంభించింది. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఈ సమయంలో ప్రపంచకప్‌ నెగ్గడానికి భారత్‌ను ఫేవరెట్‌గా చూస్తున్నా. బౌలింగ్‌ విభాగానికి బుమ్రా అద్భుతంగా నాయకత్వం వహించాడు. కుల్‌దీప్‌, రవీంద్ర జడేజా చక్కగా బౌలింగ్‌ చేస్తున్నారు. చాలాకాలంగా మొదటి ముగ్గురు బ్యాటర్లు గొప్పగా ఆడుతున్నారు. అన్ని సమయాల్లో టాప్‌-3 నుంచి పరుగులు ఆశించలేం. కాని శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ రూపంలో నాలుగు, అయిదు స్థానాల్లో మంచి కూర్పు దొరికింది’’ అని టేలర్‌ తెలిపాడు.


ఆ సమయం వచ్చింది: క్లాసెన్‌

ముంబయి: తీవ్ర ఒత్తిడిలోనూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఎంత బాగా ఆడగలరో ప్రపంచానికి చెప్పాల్సిన సమయం వచ్చిందని సఫారీ బ్యాటర్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ అన్నాడు. ప్రపంచకప్‌లో తడబడే అలవాటున్న దక్షిణాఫ్రికా ఈసారి భారీ స్కోర్లతో చెలరేగుతోంది. ‘‘ప్రపంచకప్‌లో మా ప్రదర్శనలతో ప్రతి ఒక్కరిలో దక్షిణాఫ్రికాపై అలాంటి అభిప్రాయం వచ్చింది. కానీ మేం మంచి క్రికెట్‌ ఆడాం. కొన్నిసార్లు దురదృష్టం వెంటాడింది. ఇంకొన్నిసార్లు ప్రణాళికల్ని సరిగా అమలు చేయలేకపోయాం. అయితే ప్రపంచకప్‌ చరిత్ర పరిశీలిస్తే కొన్ని అత్యుత్తమ మ్యాచ్‌లు ఆడాం. మేం గొప్పగా ఆడటం ఆశ్చర్యకరమేమీ కాదు. గత మూడేళ్లుగా ఈ జట్టు అద్భుతంగా ఆడుతోంది. ఆటగాళ్లు పరిణతి సాధిస్తున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అద్వితీయంగా ఆడగలరని ప్రపంచానికి చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అని క్లాసెన్‌ తెలిపాడు.


నేను ఓపెనర్‌ను: జాన్సన్‌

ముంబయి: క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో బ్యాటింగ్‌లో ఓపెనింగ్‌ చేసేవాడినని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ మార్కో జాన్సన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌పై 42 బంతుల్లోనే 75 పరుగులు చేసిన నేపథ్యంలో జాన్సన్‌ ఇలా పేర్కొన్నాడు. బ్యాట్‌తో వీలైనంత ఎక్కువగా ఉపయోగపడాలని అనుకుంటున్నానని అతడు చెప్పాడు. ‘‘క్రికెటర్‌గా ఆరంభ దశలో ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది. బ్యాటింగ్‌ను బాగా ఆస్వాదించేవాడిని. ఇప్పుడు ఈ విభాగంపై మరింత ఏకాగ్రత చూపించాలనుకుంటున్నా. అంతేకాదు బ్యాటర్‌గా జట్టుకు వీలైనంత ఎక్కువ ఉపయోగపడాలనేది నా కోరిక’’ అని జాన్సన్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌ ఆడుతున్న క్రికెటర్లలోకెల్లా పొడగరి అయిన జాన్సన్‌.. ఇంగ్లాండ్‌పై మెరుపు ఇన్నింగ్స్‌ ఆడడమే కాక.. క్లాసెన్‌తో కలిసి సఫారీ జట్టుకు భారీ స్కోరు అందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు