Rahul Dravid: కాస్త అదృష్టమూ కావాలి: రాహుల్‌ ద్రవిడ్‌

దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ గెలవాలంటే భారత జట్టుకు కాస్త అదృష్టమూ కలిసి రావాలని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘దక్షిణాఫ్రికాలో సిరీస్‌ గెలిచేందుకు కొన్నిసార్లు చాలా దగ్గర వరకూ వచ్చాం.

Updated : 27 Dec 2023 03:13 IST

సెంచూరియన్‌: దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్‌ గెలవాలంటే భారత జట్టుకు కాస్త అదృష్టమూ కలిసి రావాలని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘దక్షిణాఫ్రికాలో సిరీస్‌ గెలిచేందుకు కొన్నిసార్లు చాలా దగ్గర వరకూ వచ్చాం. మంచి క్రికెట్‌ ఆడాం. కానీ కొన్ని కఠిన పరిస్థితుల్లో సాధించలేకపోయాం. గీత దాటలేకపోయాం. ఇక్క పోటీపడాలంటే పరుగులు కావాలి. ఇక్కడ ఆడిన గత సిరీస్‌లో భారత్‌ ఉత్తమంగా బౌలింగ్‌ చేసింది. మాకున్న బౌలింగ్‌ దళంతో 20 వికెట్లు తీయగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఆ సిరీస్‌ ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త అదృష్టం కావాలి. చాలా బంతులు ఆడతాం, వదిలేస్తాం. వదిలేసే బంతులు దూరంగా వెళ్లాలని అనుకుంటాం. కానీ అవి బ్యాట్‌కు తగలాలని ప్రత్యర్థి కోరుకుంటుంది. ఇందులో కాస్త అదృష్టం కూడి ఉంటుంది. అయితే నైపుణ్యాలను సమర్థంగా ప్రదర్శిస్తూ, క్రమశిక్షణ, ఓపికతో బంతిని సరిగ్గా ఆడుతూ అవకాశాలను అందుకుంటే ముందుకు సాగగలం. అప్పుడు ఆడుతోంది దక్షిణాఫ్రికాలో అని అనిపించదు. భారీ స్కోర్లు చేస్తేనే తేడా ఉంటుంది. దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టుపై ఎలా ఆడాలన్నది తెలుసు’’ అని ద్రవిడ్‌ చెప్పాడు. ప్రసిద్ధ్‌ ఆశాజనకంగా కనిపిస్తున్నాడని, కానీ ఇది అతనికి తొలి టెస్టు అనేది గుర్తుంచుకోవాలని ద్రవిడ్‌ అన్నాడు. వివిధ కారణాల వల్ల ఎక్కువగా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడలేకపోయిన అతను ఈ మ్యాచ్‌ను ఆస్వాదిస్తాడని ద్రవిడ్‌ పేర్కొన్నాడు. అరంగేట్ర ఆటగాడికి కొత్త టోపీ ఇచ్చే సందర్భం ఎంతో బాగుంటుందని అతనన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని