ఇంతకన్నా బాగా ఆడలేను: పుజారా

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిదానంగా ఆడిన టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ...

Published : 10 Jan 2021 01:37 IST

విమర్శలపై స్పందించిన నయావాల్‌

ఇంటర్నెట్‌డెస్క్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నిదానంగా ఆడిన టీమిండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తూ నయావాల్‌ 176 బంతుల్లో 50 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అయితే అతడు అతి జాగ్రత్తగా ఆడటం వల్ల ఇతర బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగిందని, పుజారా వేగంగా ఆడాల్సిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీడియా సమావేశంలో పుజారా మాట్లాడాడు. ఆస్ట్రేలియా పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్న ఆ పరిస్థితుల్లో అంతకంటే గొప్పగా ఆడలేనని విమర్శలపై స్పందించాడు.

‘‘నేను బాగానే ఆడాను. కానీ, మంచి బంతికి ఔటయ్యా. దాన్ని అంగీకరించాల్సిందే. ఇంతకన్నా గొప్పగా నేను ప్రయత్నించలేను. కమిన్స్‌ ఆడలేని బంతులు విసురుతున్నాడు. అది ‘బాల్‌ ఆఫ్ ది సిరీస్‌’గా నిలుస్తుంది (అతడు ఔటైన బంతి గురించి). బ్యాక్‌ లెంగ్త్‌తో వేసిన ఆ బంతిని వదిలేయాలనుకున్నా. కానీ అది ఎక్స్‌ట్రా బౌన్స్‌ అయింది. మీ రోజు కానప్పుడు పొరపాట్లు జరుగుతుంటాయి’’ అని అన్నాడు.

మెల్‌బోర్న్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో పుజారా వేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ గాయం బ్యాటింగ్‌పై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అని అడిగిన ప్రశ్నకు పుజారా బదులిచ్చాడు. ‘‘గాయం ప్రభావమేమీ లేదు. అయితే నేను 100 శాతం ఫిట్‌నెస్‌తో లేను. తక్కువ నొప్పిని భరించగలను. ఇది ఎంతో కీలక మ్యాచ్‌ కాబట్టి దూరంగా ఉండలేను’’ అని పేర్కొన్నాడు. అయితే మూడో రోజు ఆటలో 330-340 పరుగులు సాధించడానికి గొప్పగా ప్రయత్నించామని, కానీ రిషభ్‌ పంత్‌ ఔటవ్వడం టర్నింగ్ పాయింట్‌గా మారిందని నయావాల్‌ తెలిపాడు. పంత్ ఔటైన తర్వాత ఆసీస్‌ పైచేయి సాధించిందని వెల్లడించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 244 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.

అయితే గాయంతో జడేజా రెండో ఇన్నింగ్స్‌కు దూరమవ్వడం జట్టుకు ప్రతికూలాంశమని పుజారా తెలిపాడు. జడ్డూ గైర్హాజరీతో మిగిలిన బౌలర్లపై ఒత్తిడి పెరుగుతుందని, ఎక్కువ ఓవర్లు వేయాల్సి ఉంటుందని అన్నాడు. అంతేకాకుండా తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు సాధించిన జడ్డూ రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేవాడని పేర్కొన్నాడు. ఆల్‌రౌండర్‌గానే కాకుండా గొప్ప ఫీల్డర్‌గా జడేజా జట్టుకు విలువైన ఆటగాడని కొనియాడాడు. అతడి గైర్హాజరీ జట్టుకు లోటైనా గొప్పగా పుంజుకుని ఆస్ట్రేలియాపై పైచేయి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎడమచేతి బొటనవేలుకి గాయమవ్వడంతో జడ్డూ మ్యాచ్‌కు దూరమైన సంగతి తెలిసిందే. కాగా, సిడ్నీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా 197 పరుగుల ఆధిక్యంలో ఉంది.

ఇదీ చదవండి

నయావాల్‌.. డీకోడెడ్‌!

భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని