IND vs PAK: పాక్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్‌ ఆడతాడా..? తుది జట్టు కూర్పే ఆసక్తికరం!

క్రికెట్‌ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భారత్‌  ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌లో చిరకాల ప్రత్యర్థుల (IND vs PAK) పోరు నేడే.

Updated : 14 Oct 2023 11:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) ఇవాళ క్రికెట్‌ పండగ. అహ్మదాబాద్‌ వేదికగా భారత్ - పాకిస్థాన్‌(IND vs PAK) మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. అయితే, తుది జట్టు ఎంపికపై అందరిలోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. ఎవరిని తీసుకుంటారు..? ఎవరిని పక్కన పెడతారు? అనేది ఆసక్తికరంగా మారింది. పాక్‌ పేస్‌ను తట్టుకోవాలంటే బ్యాటింగ్‌ బలంగా ఉండాలి. అదే సమయంలో పదునైన బౌలింగ్‌తో బరిలోకి దిగాలి. తుది జట్టులోని దాదాపు అన్ని స్థానాలు ఓకే అయినప్పటికీ.. కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ఒకటీ రెండు మార్పులు ఉంటాయని చెప్పిన విషయం గుర్తుంది కదా. మరి ఆ మార్పులు ఎక్కడ ఉండొచ్చనేదే కీలకంగా మారింది. 

ఓపెనింగ్‌లో వీరు..

తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన శుభ్‌మన్‌ గిల్ ఇప్పుడు పాక్‌తో ఆడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. డెంగీ నుంచి కోలుకుని ప్రాక్టీస్‌ కూడా చేశాడు. అయితే, గిల్‌ను ఆడించకూడదని మేనేజ్‌మెంట్‌ భావిస్తే మాత్రం ఇషాన్‌ కిషన్‌కు మరో అవకాశం వచ్చినట్లే. కానీ, గత రెండు మ్యాచుల్లో ఇషాన్‌ సాధికారిక ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ను ఓపెనర్‌గా తీసుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పవర్‌ ప్లేలో భారీ షాట్లు కొట్టడం, పేస్‌ను అద్భుతంగా ఆడగలిగే సూర్య సెట్‌ అవుతాడనేది క్రికెట్ విశ్లేషకుల అంచనా. అయితే, కీలక పోరులో భారత్‌ ప్రయోగాలకు వెళ్తుందా..? అనేది కూడా సందేహమే. 

వీరంతా ఫిక్స్‌..

భారత టాప్‌ ఆర్డర్‌లో ఓపెనర్లు కాకుండా వన్‌డౌన్‌, సెకండ్‌ డౌన్ చాలా కీలకం. అయితే, ఈ రెండు స్థానాల్లో టీమ్‌ఇండియాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఆడతాడు. ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్ కూడా ఫామ్‌లోకి వచ్చేయడం టీమ్‌ఇండియాకు కలిసొచ్చేదే. ఇక మిడిలార్డర్‌లో కేఎల్ రాహుల్‌, హార్దిక్‌ పాండ్య బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతూ జట్టుకు అండగా నిలిచారు. లోయర్‌ ఆర్డర్‌లో రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/రవిచంద్రన్ అశ్విన్‌ కూడా విలువైన పరుగులు చేయగల సత్తా ఉన్న బ్యాటర్లు. అయితే శార్దూల్‌ లేదా అశ్విన్‌లో ఒకరికే అవకాశం ఉండొచ్చు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలంగా ఉందని భావిస్తే అశ్విన్‌ వైపు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపనుంది.

బౌలింగ్‌ దళం ఇదే..

భారత స్క్వాడ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్‌, షమీ ప్రధాన పేసర్లు కాగా.. హార్దిక్‌పాండ్య, శార్దూల్‌ ఠాకూర్ పేస్‌ ఆల్‌రౌండర్లు. ఇక అశ్విన్‌, జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌ స్పిన్‌ బాధ్యతలు తీసుకున్నారు. హార్దిక్‌, శార్దూల్‌ తుది జట్టులో ఉంటే మరో ఇద్దరు పేసర్లను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పాక్‌పై అద్భుతంగా బౌలింగ్‌ చేసే షమీని తీసుకోవడం ఉత్తమమనే వాదనా ఉంది. అప్పుడు బుమ్రా, షమీ, హార్దిక్‌, శార్దూల్‌తోపాటు జడేజా, కుల్‌దీప్‌తో కూడిన బౌలింగ్‌ దళం బరిలోకి దిగనుంది. పాక్‌ బ్యాటర్లు బాబర్, రిజ్వాన్, షకీల్, అబ్దుల్లా, ఇఫ్తికార్‌ను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాలి. 

భారత తుది జట్టు (అంచనా): రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌/ఇషాన్‌, కోహ్లీ, శ్రేయస్‌, రాహుల్‌, హార్దిక్‌, జడేజా, అశ్విన్‌/శార్దూల్, కుల్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌/షమీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని