IND vs ENG: ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు.. ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌ లీడ్‌ 255

ఐదో టెస్టులోనూ టీమ్‌ఇండియా భారీ ఆధిక్యం సాధించింది. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొని పట్టు బిగించే దిశగా భారత్‌ సాగుతోంది.

Updated : 08 Mar 2024 17:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌ బౌలర్లపై టాప్‌ -5 బ్యాటర్ల ఆధిపత్యం.. భారత టెయిలెండర్లు క్రీజ్‌లో పాతుకుపోయిన విధానం అద్భుతం. మరీ ముఖ్యంగా కుల్‌దీప్‌ యాదవ్‌ పక్కా బ్యాటర్‌గా ఆడటం విశేషం. దీంతో ఐదో టెస్టులో టీమ్‌ఇండియా భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోయింది. ఆరంభంలో ఇద్దరు సెంచరీలు.. ముగ్గురు హాఫ్ సెంచరీలు చేయడంతో బలమైన పునాది పడింది.. ఇవీ ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు రెండో రోజు ఆట విశేషాలు..

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టు రెండో రోజు ఆటలోనూ (IND vs ENG) భారత్‌దే ఆధిపత్యం. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా భారీ లీడ్‌లోకి దూసుకెళ్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 473 పరుగులు చేసింది. క్రీజ్‌లో కుల్‌దీప్‌ యాదవ్ (27*), జస్‌ప్రీత్ బుమ్రా (19*) ఉన్నారు. అంతకుముందు రోహిత్ శర్మ (103), శుభ్‌మన్‌ గిల్ (110) సెంచరీలతో కదం తొక్కారు. యశస్వి జైస్వాల్ (57), దేవదుత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లాండ్‌ స్పిన్నర్ షోయబ్‌ బషీర్ (4/170) నాలుగు వికెట్లు తీసినప్పటికీ.. పరుగులను నియంత్రించలేకపోయాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా ఆధిక్యం 255 పరుగులు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 218 రన్స్‌కే కుప్పకూలింది.

ఐదుగురు అదుర్స్‌..

ఓవర్‌నైట్‌ 135/1 స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు శుభారంభమే దక్కింది. రెండో వికెట్‌కు రోహిత్, గిల్ ఏకంగా 171 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేశారు. చాలా రోజుల తర్వాత బౌలింగ్‌కు వచ్చిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్‌ స్టోక్స్‌ సంధించిన తొలి బంతికే రోహిత్ క్లీన్‌ బౌల్డయ్యాడు. అయితే, స్వల్ప వ్యవధిలో రోహిత్-గిల్‌ ఔట్‌ కావడంతో టీమ్‌ఇండియా ఇబ్బందుల్లో పడినట్లు అనిపించినా కోలుకోగలిగింది. అరంగేట్ర బ్యాటర్ దేవదుత్ పడిక్కల్‌, సర్ఫరాజ్ ఖాన్ అర్ధశతకాలతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. దీంతో తొలి ఐదుగురు బ్యాటర్లు 50+ స్కోర్లు చేయడం విశేషం. మరోసారి ఇంగ్లాండ్‌ బౌలర్లు విజృంభించి పడిక్కల్‌, ధ్రువ్‌ జురెల్ (15), రవీంద్ర జడేజా (15), రవిచంద్రన్ అశ్విన్‌ (0)ను ఔట్‌ చేశారు. వందో టెస్టు ఆడుతున్న అశ్విన్‌ తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ కావడం గమనార్హం. అయితే, కుల్‌దీప్‌ యాదవ్ - జస్‌ప్రీత్ బుమ్రా క్రీజ్‌లో పాతుకుపోయారు. ఇప్పటికే తొమ్మిదో వికెట్‌కు 108 బంతుల్లో 45 పరుగులు జోడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని