IND vs ENG: ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు.. టీమ్‌ఇండియా జోరు కొనసాగేనా..?

ఇంగ్లాండ్‌తో ఆఖరి టెస్టు(IND vs ENG)కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. రోహిత్‌ సేన అదే జోరును కొనసాగిస్తుందా.. జట్టు కూర్పు ఎలా ఉండనుంది..

Updated : 06 Mar 2024 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ (IND vs ENG 2024)లో ఆఖరి మ్యాచ్‌కు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ఇప్పటికే 3-1తో సిరీస్‌ కైవసం చేసుకున్న రోహిత్‌ సేనకు ఇది నామమాత్రపు మ్యాచే. ఇందులోనూ విజయం సాధించి ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమ్‌ఇండియా (Team India) భావిస్తోంది. WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కాపాడుకోవాలంటే ఇక నుంచి ప్రతి మ్యాచ్‌ భారత్‌కు కీలకమే.

జట్టు కూర్పు ఎలా..?

నాలుగో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్‌ పేసర్‌ బుమ్రా.. ధర్మశాలలో జరిగే చివరి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమయ్యాడు. మూడు టెస్టుల్లో 17 వికెట్లు తీసి మంచి ఊపుమీదున్నాడు. బుమ్రా తుది జట్టులోకి రావడంతోఎవరిని పక్కనపెడతారో చూడాలి. మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌లో ఒకరిపై వేటు వేస్తారా? లేక ధర్మశాల పిచ్‌ పరిస్థితులను బట్టి ముగ్గురు పేసర్లతో వెళ్తారా అనేది చూడాలి. ఈ సిరీస్‌లో అదరగొడుతున్న జైస్వాల్‌తో ఎప్పటిలాగే రోహిత్‌ ఓపెనింగ్‌ చేస్తాడు.

భయమేల.. రవిచంద్రుడుండగ!

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా నాలుగో టెస్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ధ్రువ్‌ జురెల్‌ తుది జట్టులో ఉండటం ఖాయమే. చివరి టెస్టుకూ కేఎల్‌ రాహుల్‌ దూరం కావడం, రజత్‌ పటీదార్‌ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. దేవదత్‌ పడిక్కల్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఇక వందో టెస్టు ఆడుతున్న సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎలాగూ తుది జట్టులో ఉంటాడు. అతడితో కలిసి ఆల్‌రౌండర్‌ కోటాలో రవీంద్ర జడేజా చేరతాడు. మూడో పేసర్‌ vs స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ చర్చలో టీమ్‌ మేనేజ్‌మెంట్‌ స్పిన్నర్‌ వైపు మొగ్గు చూపితే కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులో ఉంటాడు. 

ధర్మశాల పిచ్‌ ఇలా..

చల్లటి వాతావరణ పరిస్థితుల కారణంగా.. ధర్మశాల పిచ్‌ సీమర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత స్పిన్నర్ల ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ 2017లో జరిగిన ఏకైక టెస్టులో భారత్‌.. ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అప్పుడు స్పిన్నర్లు కీలకపాత్ర పోషించారు. ఆ మ్యాచుతో అరంగేట్రం చేసిన కుల్‌దీప్‌.. నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఈ పిచ్‌ వన్‌ సైడెడ్‌గా ఉండదని .. రెండు జట్లకు అనుకూలిస్తుందని ఇంగ్లాండ్‌ బ్యాటర్‌, వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్‌స్టో చెప్పాడు.

అగ్రస్థానంలో కొనసాగాలంటే..

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో న్యూజిలాండ్‌ ఘోర ఓటమితో WTC పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమ్‌ఇండియా తొలి స్థానానికి చేరింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 64.58 విజయాల శాతంతో టాప్‌లో నిలవగా.. న్యూజిలాండ్‌ 60 శాతం, ఆస్ట్రేలియా 59.09 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారత్‌ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే ప్రతి మ్యాచ్‌ కీలకమే.

టీమ్‌ఇండియా జట్టు (అంచనా) : రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, దేవదత్‌ పడిక్కల్‌/ రజత్‌ పటీదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్‌దీప్‌ యాదవ్‌/ఆకాశ్‌ దీప్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని