Ishan Kishan - ODI WC 2023: ఒక్క ఇన్నింగ్స్.. అన్నింటికీ సమాధానం.. ఫేవరేట్‌గా మారిన ఇషాన్ కిషన్
టాప్ ఆర్డర్‌లోని స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట.. పాక్ పేస్‌ను ఎదుర్కొని మరీ కీలక ఇన్నింగ్స్ ఆడిన భారత యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాడు. వచ్చే ప్రపంచ కప్ రేసులో దూసుకెళ్లాడనే చెప్పాలి.
వన్డే ప్రపంచకప్‌నకు ఇంకో నెల రోజులే సమయం ఉంది. మరి ఈ టోర్నీలో భారత జట్టుకు వికెట్ కీపర్‌గా వ్యవహరించేది ఎవరు? రిషబ్ పంత్ స్థానాన్ని భర్తే చేసే సామర్థ్యం ఎవరికి ఉంది? బలహీనంగా కనిపిస్తున్న మిడిలార్డర్‌కు భరోసా ఇచ్చేదెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్క ఇన్నింగ్స్‌తో సమాధానం ఇచ్చాడు ఇషాన్ కిషన్. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మీద అతనాడిన ఇన్నింగ్స్ టీమ్‌ఇండియాకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు.
సొంతగడ్డపై జరగనున్న ప్రపంచకప్‌లో భారీ అంచనాలతోనే బరిలోకి దిగుతోంది భారత్. కానీ పేరుకు ఫేవరెట్టే కానీ.. ప్రపంచకప్ దిశగా మన జట్టు సరైన సన్నద్ధతతో సాగుతోందా అనే విషయంలో అభిమానులకు సందేహాలున్నాయి. ఇంకా ప్రపంచకప్ జట్టుపై ఒక అంచనాకు రాలేదు. కొందరు ఆటగాళ్ల ఫామ్, ఫిట్‌నెస్ ఆందోళన రేకెత్తిస్తోంది. ఏ స్థానంలో ఎవరు ఆడతారనే విషయంలో స్పష్టత లేదు. పాకిస్థాన్‌తో శనివారం జరిగిన ఆసియా కప్ మ్యాచ్ అభిమానుల ఆందోళనను మరింత పెంచింది. ఈ కీలక పోరులో సత్తా చాటుతారని ఆశించిన సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశ పరిచారు. మిగతా టాప్ ఆర్డర్ బ్యాటర్లు కూడా తేలిపోయారు.
ఐతే స్వతహాగా ఓపెనర్ అయినప్పటికీ.. జట్టు అవసరాల రీత్యా ఈ మ్యాచ్‌లో మిడిలార్డర్లో దిగిన ఇషాన్ కిషన్.. హార్దిక్ పాండ్యతో కలిసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి జట్టు ఆశల్ని నిలబెట్టాడు. భీకరమైన పాక్ పేస్ దాడిని అతను ఎదుర్కొన్న విధానం ప్రశంసలు అందుకుంది. జట్టుకు గొప్ప భరోసాను ఇచ్చింది. పెద్దగా అనుభవం లేకపోయినా.. అతను గొప్ప పరిణతి చూపించాడు. సంయమనంతో ఆడుతూ క్రీజులో పాతుకుపోవడమే కాక.. సమయోచితంగా షాట్లూ ఆడాడు. పేస్, స్పిన్ అని తేడా లేకుండా అందరు బౌలర్లనూ సమర్థంగా ఎదుర్కొన్నాడు. ప్రపంచకప్ సమీపిస్తుండగా ఇలాంటి ప్రదర్శన జట్టుకు ఎంతో ఉపకరించేదే.
వారిద్దరిలో ఎవరికి చోటు..? వీరిద్దరిపైనేనా వేటు? వరల్డ్ కప్ కోసం భారత జట్టు ప్రకటన నేడేనా?
ఇషాన్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటికే కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ముఖ్యంగా వన్డేల్లో అతడి ప్రదర్శన బాగానే ఉంది. గత ఏడాది చివర్లో బంగ్లాదేశ్‌పై మెరుపు డబుల్ సెంచరీతో ఎలైట్ లిస్ట్ ఎక్కాడతను. కానీ ఆ తర్వాత అతను ఆశించిన స్థాయిలో నిలకడ చూపించలేదు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమైన రిషబ్ పంత్ స్థానాన్ని అతను భర్తీ చేయగలడా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఒకప్పుడు ద్రవిడ్ తరహాలో కేఎల్ రాహుల్‌ను వన్డే ప్రపంచకప్‌కు వికెట్ కీపర్‌గా ఉపయోగించుకోవాలని అనుకుంది టీమ్ ఇండియా. కానీ అతను ఐపీఎల్‌లో గాయపడి కొన్ని నెలల పాటు మైదానానికి దూరమయ్యాడు. ఇటీవల కోలుకున్నట్లే కనిపించినా.. మళ్లీ ఏదో ఫిట్‌నెస్ సమస్య తలెత్తి ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో ప్రపంచకప్‌కు వికెట్ కీపర్ ఎవరనే ప్రశ్న తలెత్తింది.
మరోవైపు రోహిత్, శుభ్‌మన్, కోహ్లిలతో టాప్‌ఆర్డర్ చూడ్డానికి బలంగానే కనిపిస్తున్నా.. మిడిలార్డర్లో హార్దిక్ పాండ్య మినహా నమ్మదగ్గ బ్యాటర్ లేక బలహీనంగా మారింది. ప్రపంచకప్‌నకు ముందు భారత్‌ను ఆందోళన రేకెత్తిస్తున్న విషయాల్లో మిడిలార్డర్ కూడా ఒకటి. ఐతే పాకిస్థాన్‌తో ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ కొన్ని ప్రశ్నలకు, ఆందోళనలకు తెరదించింది. తీవ్ర ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో, ప్రతికూల పరిస్థితుల్లో, మేటి బౌలర్లను ఎదుర్కొంటూ ఇషాన్ ఆడిన 82 పరుగుల ఇన్నింగ్స్ జట్టుకు భరోసానిచ్చింది. అతనే ప్రపంచకప్‌కు వికెట్ కీపర్ అనే విషయాన్ని రూఢి చేసింది. అలాగే మిడిలార్డర్ సమస్యకూ పరిష్కారం చూపింది.
వీళ్లకు దారులు మూసుకుపోయినట్లే
ఇషాన్ పాక్‌పై ఆడిన ఇన్నింగ్స్‌తో ప్రపంచకప్‌లో ఇద్దరు ఆటగాళ్లకు దారులు మూసుకుపోయినట్లు అయింది. ముఖ్యంగా సంజు శాంసన్‌కు ఇది ఇబ్బందికరమే. సంజు శాంసన్ గొప్ప ప్రతిభావంతుడని.. అతడికి భారత జట్టులో చోటు ఇవ్వకపోవడం అన్యాయం అని ఎప్పట్నుంచో తన మద్దతుదారులు గళం విప్పుతున్నారు. కానీ వచ్చిన అవకాశాలను అతను పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో అతను నిరాశ పరిచాడు. ఆసియా కప్‌నకు అతను బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. రాహుల్ తప్పుకుంటే ప్రపంచకప్‌లో అతడికి చోటు దక్కుతుంది. అలా జట్టులోకి వచ్చినా.. తుది జట్టులో మాత్రం ఇషాన్‌ను దాటి అవకాశం దక్కించుకోవడం అసాధ్యం. ఇక ఇషాన్ ఇన్నింగ్స్‌తో రాహుల్‌కు కూడా చెక్ పడినట్లే. అతను ఫిట్‌నెస్ సాధించి ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించినా.. ఫామ్‌లో ఉన్న, స్పెషలిస్ట్ వికెట్ కీపర్ అయిన ఇషాన్‌ను కాదని తుది జట్టులో చోటిస్తారా అన్నది సందేహమే.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
తిరుమలలో బ్రేక్ దర్శనం, గదుల బుకింగ్‌కు ‘పే లింక్’ సందేశాలతో నగదు చెల్లింపు!
-
విశాఖలో పిడుగు పాటు.. వీడియో వైరల్
-
ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ విద్యార్థిని బలవన్మరణం
-
రావణుడి అత్తవారింట రామాలయం.. 35 ఏళ్లుగా తిరిగిచూడని భక్తులు
-
Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు నివాసం వద్ద అర్ధరాత్రి భారీగా పోలీసుల మోహరింపు
-
సముద్రంలో 36 గంటలు.. గణపతి విగ్రహ చెక్కబల్లే ఆధారంగా..