James Anderson: జేమ్స్‌ అండర్సన్‌ @ 700.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో అరుదైన ఘనత

ఇంగ్లాండ్‌ సీనియర్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు.

Updated : 09 Mar 2024 14:17 IST

(ఫొటో సోర్స్: ఐసీసీ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్‌ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన అండర్సన్ 700 వికెట్ల క్లబ్‌లోకి చేరాడు. 41 ఏళ్ల వయసులో ఫీట్‌ను సాధించిన అండర్సన్ 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టుల్లో 700 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డుకెక్కిన అండర్సన్‌.. తొలి పేసర్‌గా నిలవడం విశేషం. అంతకుముందు ముత్తయ్య మురళీ ధరన్ 800, షేన్ వార్న్ 709 వికెట్లతో ముందున్నారు. అండర్సన్ మరో 10 వికెట్లు తీస్తే వార్న్‌ను అధిగమించే అవకాశం ఉంది. 

ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో శుభ్‌మన్‌ గిల్, కుల్‌దీప్‌ యాదవ్‌ను ఔట్‌ చేసిన అండర్సన్ 700 వికెట్ల జాబితాలోకి వచ్చాడు. తొలిసారి 2002లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది టెస్టుల్లోకి అడుగు పెట్టిన అండర్సన్ ఇప్పటి వరకు 187 టెస్టులు ఆడాడు. 32 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 7/42. ఇంగ్లాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ నిలిచాడు. ఇప్పటికే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టువర్ట్‌ బ్రాడ్‌ మాత్రమే 604 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుత తరం ఇంగ్లాండ్‌ బౌలర్లు ఎవరూ వీరిద్దరి దరిదాపుల్లోకి లేరు. దీంతో అండర్సన్‌ రికార్డును బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యమే.

బెయిర్‌స్టో వందో టెస్టు.. 6000+ పరుగులు

జానీ బెయిర్‌స్టో తన వందో టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 68 పరుగులు చేశాడు. దీంతో టెస్టుల్లో 6000+ పరుగులు పూర్తి చేసుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన 17వ ఇంగ్లాండ్‌ బ్యాటర్‌గా నిలిచాడు. ప్రస్తుతం బెయిర్‌స్టో 6,042 పరుగులతో కొనసాగుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని