Pujara: వంద టెస్టులు ఆడతానని అనుకోలేదు.. నా డ్రీమ్ అదే: ఛెతేశ్వర్‌ పుజారా

తన కెరీర్‌ ప్రారంభించినప్పుడు భారత్‌ తరఫున వంద టెస్టు మ్యాచ్‌లు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదని  ఛెతేశ్వర్‌ పుజారా  (Cheteshwar Pujara) చెప్పాడు.

Published : 16 Feb 2023 18:51 IST

ఇంటర్నెట్ డెస్క్‌:టీమ్‌ఇండియా టెస్టు స్పెషలిస్టు, నయా వాల్ ఛెతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) త్వరలో వంద టెస్టుల క్లబ్‌లో చేరనున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి దిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభంకానున్న రెండో టెస్టుతో తన కెరీర్‌లో వందో టెస్టుని ఆడనున్నాడు. తన కెరీర్‌ ప్రారంభదశంలో భారత్‌ తరఫున వంద టెస్టు మ్యాచ్‌లు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదని చెప్పాడు. ఈ సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ట్రోఫీని టీమ్‌ఇండియా  (Team India)సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

‘నేను క్రికెట్ ఆడటం మొదలుపెట్టి, ఆ తర్వాత నా టెస్ట్ అరంగేట్రం చేసినప్పుడు వంద టెస్టు మ్యాచ్‌లు ఆడతానని ఎప్పుడూ అనుకోలేదు. నేనెప్పుడూ వర్తమాన విషయాలపైనే దృష్టిపెడతాను. భవిష్యత్‌ గురించి ఆలోచించను. నేను వందో టెస్టు ఆడబోతున్నానని ఈ సిరీస్‌ ప్రారంభం అయ్యే ముందు గ్రహించాను. నేను సాధించాల్సింది చాలా ఉంది. ఇప్పటివరకైతే సంతృప్తికరంగా ఉన్నా. వందో టెస్టులో ఆడటం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నా. మేం చాలా కీలకమైన సిరీస్‌ ఆడుతున్నాం. మేం ఈ మ్యాచ్‌ (రెండో టెస్టు)తోపాటు మరో టెస్టులో విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌ (WTC Final)కు అర్హత సాధిస్తామని ఆశిస్తున్నా. భారత్‌ తరఫున  డబ్ల్యూటీసీ ఫైనల్‌లో గెలవాలన్నది నా డ్రీమ్‌. కిందటిసారి (2021లో) ఫైనల్‌లో ఓడిపోయాం. కానీ, ఈ సారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించి ఆ ట్రోఫీని సాధిస్తామని ఆశిస్తున్నా’ అని పుజారా అన్నాడు.

క్రికెటర్లకు కుటుంబసభ్యుల మద్దతు చాలా కీలకమని పేర్కొంటూ తన జీవితంలో మద్దతుగా నిలిచిన స్నేహితులు, కుటుంబసభ్యులు, కోచ్‌లకు పుజారా కృతజ్ఞతలు తెలిపాడు. 2010లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన పుజారా ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడాడు. 44.16 సగటుతో 7,021 పరుగులు చేశాడు. డిఫెన్స్‌ ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లకు విసుగు పుట్టిస్తూ నయా వాల్‌గా గుర్తింపు పొందాడు. టెస్టుల్లో 19 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు బాదాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని