PAK vs AUS: రావల్పిండి పిచ్‌పై విమర్శలు.. స్పందించిన రమీజ్‌ రాజా

రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగీయడంపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఐదు రోజుల ఆటలో కేవలం 14 వికెట్లే పడటంతో...

Updated : 10 Mar 2022 16:56 IST

(Photo: Pakistan Cricket Board Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: రావల్పిండి వేదికగా పాకిస్థాన్‌ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియడంపై నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఐదు రోజుల ఆటలో కేవలం 14 వికెట్లే పడటంతో అంతా పిచ్‌ను నిందిస్తున్నారు. పిచ్‌ను సరిగ్గా తయారు చేయలేదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డును విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక వీడియో విడుదల చేసిన ఆ జట్టు క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ రమీజ్‌ రాజా.. రావల్పిండి లాంటి పిచ్‌ టెస్టు క్రికెట్‌కు మంచిది కాదన్నాడు.

‘టెస్టు క్రికెట్‌లో డ్రాగా ముగిసిన మ్యాచ్‌లు ఎప్పుడూ మంచిది కాదు. అలాగే ఈకాలంలో ఐదు రోజుల్లో కచ్చితంగా ఫలితం రావాలనే విషయాన్ని నేనూ అర్థం చేసుకుంటా. 90 శాతం వరకు అలాంటి ఫలితాలే వస్తాయి. అయితే, నేనిక్కడ రెండు, మూడు విషయాలు చెప్పదల్చుకున్నా. పిచ్‌లను తయారు చేయాలంటే ఐదారు నెలల సమయం పడుతుంది. ప్రస్తుత సీజన్‌ ఏప్రిల్‌తో ముగుస్తున్నందున ఆ తర్వాత పాకిస్థాన్‌లోని పిచ్‌లను తిరిగి రూపొందిస్తాం. అయితే, ఈ మ్యాచ్‌ పట్ల అభిమానుల వేదనను నేను అర్థం చేసుకోగలను. ఇందులో ఫలితం వచ్చి ఉంటే బాగుండేది. కానీ, ఇలా డ్రాగా ముగియడం బాగోలేదు. అలాగే ఇది మూడు టెస్టుల సిరీస్‌ కాబట్టి ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడేదో విమర్శలు వచ్చాయని చెప్పి వెంటనే ఫాస్ట్‌, బౌన్సీ పిచ్‌లు తయారు చేసి మ్యాచ్‌లను ఆస్ట్రేలియాకు అప్పగించలేం’ అని రమీజ్‌ స్పందించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని