Best ODI Team Of 2023: జట్టులో వారెవరూ లేరు.. భారత అభిమానులే ఓటింగ్‌ చేసినట్లుంది: రవిశాస్త్రి

ఓ క్రీడా ఛానెల్‌ ప్రకటించిన ఉత్తమ వన్డే జట్టుపై భారత మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత రవిశాస్త్రి తన విశ్లేషణను కుండబద్దలు కొట్టాడు.

Published : 28 Dec 2023 15:22 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో కూడిన జట్టును (Best odi Team 2023)  ప్రముఖ క్రీడా ఛానెల్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రకటించింది. అందులో ఎనిమిదిమంది భారత ఆటగాళ్లకు చోటు దక్కడం గమనార్హం. క్రికెట్ అభిమానుల ఓటింగ్‌ను బట్టే ఈ ఎంపిక జరిగిందని ఆ ఛానెల్‌ పేర్కొంది. అయితే, జట్టు ఎంపికపై భారత మాజీ క్రికెటర్‌ రవిశాస్త్రి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. కేవలం టీమ్‌ఇండియా క్రికెట్ అభిమానులే ఓటింగ్‌లో పాల్గొన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించాడు. 

‘‘జట్టు ఎంపిక మరీ హాస్యాస్పదంగా ఉంది. మిచెల్‌ మార్ష్, రషీద్‌ ఖాన్, క్వింటన్ డికాక్‌ వంటి ఆటగాళ్లకు అవకాశమే లేదా? కేవలం భారత క్రికెట్‌ అభిమానులు మాత్రమే ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారేమో అనిపిస్తోంది. వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన ఆసీస్‌ జట్టు నుంచి కేవలం ఒక్క ఆటగాడికే అవకాశం ఇచ్చారు. అదీనూ ఆడమ్‌ జంపాను ఎంపిక చేశారు. రషీద్‌ ఖాన్‌ అత్యుత్తమ ఆల్‌రౌండర్. అలాగే జడేజానూ ఎంపిక చేయలేదు. రషీద్-జడేజా కాంబినేషన్‌ ఏ ఫార్మాట్‌లోనైనా సూపర్‌ జోడీ. న్యూజిలాండ్‌ మిడిలార్డర్‌ బ్యాటర్ డారిల్‌ మిచెల్ అత్యంత ప్రమాదకర బ్యాటర్. అతడికి అవకాశం ఇవ్వడం బాగుంది’’ అని రవిశాస్త్రి విశ్లేషించాడు. ఉత్తమ వన్డే జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్, డారిల్‌ మిచెల్, కేఎల్ రాహుల్, హెన్రిచ్ క్లాసెన్, ఆడమ్ జంపా, కుల్‌దీప్ యాదవ్, షమీ, సిరాజ్‌, బుమ్రా ఉన్నారు.

గ్లెన్‌ మాక్స్‌వెల్‌కూ దక్కని అవకాశం: ఫిలాండర్‌

‘‘నేనే క్వింటన్‌ డికాక్‌ను అయి ఉంటే ఈ సెలక్షన్‌ను చూసి తీవ్ర నిరుత్సాహానికి గురయ్యేవాడిని. ఈ ఏడాదే వన్డేలకు అతడు వీడ్కోలు పలికాడు. అతడు అద్భుతమైన ఆటగాడు. అయితే, భారత అభిమానులు ఎందుకు ఇలా సెలక్ట్‌ చేశారనేది నాకర్థమవుతోంది. ఈ ఏడాది టీమ్‌ఇండియా మంచి ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లీ స్థిరత్వం తీసుకొచ్చాడు. ఈ జాబితాలో ఐదెన్ మార్‌క్రమ్‌ లేదా డేవిడ్‌ మిల్లర్‌ ఉండాల్సింది. ఇక ఒంటిచేత్తో అఫ్గాన్‌పై ఆసీస్‌ను గెలిపించిన గ్లెన్ మాక్స్‌వెల్‌ను ఎలా వదిలేశారు? ఆసీస్‌ వరల్డ్‌ కప్‌ గెలవడంలో అతడిదే కీలక పాత్ర’’ అని దక్షిణాఫ్రికా మాజీ పేసర్ వెర్నాన్ ఫిలాండర్‌ వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని