Rohit Sharma: ఇంగ్లాండ్‌ బజ్‌బాల్ క్రికెట్‌.. మా బౌలర్లకు ప్రశాంతంగా ఉండమని చెప్పా: రోహిత్

రాజ్‌కోట్‌ వేదికగా మ్యాచ్‌లో (IND vs ENG) ఇంగ్లాండ్‌పై భారత్‌ 434 పరుగుల రికార్డు విజయం సాధించింది. టెస్టుల్లో భారత్‌కిదే అతిపెద్ద గెలుపు కావడం విశేషం.

Published : 19 Feb 2024 01:57 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల (IND vs ENG) సిరీస్‌లో భారత్‌ 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పర్యటక జట్టును 434 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్‌ అనంతరం భారత కెప్టెన్ రోహిత్, ఇంగ్లాండ్‌ సారథి బెన్ స్టోక్స్‌తోపాటు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్న రవీంద్ర జడేజా మాట్లాడారు. ఇంగ్లాండ్ బజ్‌బాల్‌ క్రికెట్‌పై హిట్‌మ్యాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

రెండు మూడు రోజులకే కాదు..: రోహిత్ (Rohit Sharma)

‘‘టెస్టు క్రికెట్‌ ఆడుతున్నప్పుడు రెండు లేదా మూడు రోజులను దృష్టిపెట్టుకోకూడదు. ఐదు రోజుల వరకు మ్యాచ్‌ను పొడిగించడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాం. ఇంగ్లాండ్‌ బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగానే ఆడారు. కొన్ని షాట్లను మేం కూడా ఊహించలేదు. మమ్మల్ని కాస్త ఒత్తిడికి గురి చేశారు. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. ప్రత్యర్థి బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్న సమయంలో మా బౌలర్లకు ఒకటే చెప్పా. వారు బజ్‌బాల్‌ క్రికెట్ ఆడినా మీరు మాత్రం ప్రశాంతంగా ఉండండి. మూడో రోజు మా బౌలర్లు పుంజుకున్న తీరు బాగుంది. రవీంద్ర జడేజా తన అనుభవం మొత్తం ఉపయోగించాడు. బ్యాటింగ్‌లోనూ కీలక పరుగులు సాధించాడు. సర్ఫరాజ్‌ నాణ్యమైన క్రికెటింగ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ కెరీర్‌ను అత్యుత్తమంగా మొదలుపెట్టాడు. ఇప్పుడూ అలానే కొనసాగుతున్నాడు. అంతకంటే అతడి గురించి ఎక్కువ చెప్పలేను. ఇద్దరు కుర్రాళ్లు (సర్ఫరాజ్‌, యశస్వి) తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు’’ అని రోహిత్ తెలిపాడు.

కొన్నిసార్లు ప్రణాళికలు పారవు: బెన్‌ స్టోక్స్ (Ben Stokes)

‘‘బెన్ డకెట్ సూపర్‌ సెంచరీతో అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌ ఆసాంతం ఇదే దూకుడుగా ఆడాలని భావించాం. భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకు దగ్గరగా వెళ్లేందుకు కొన్ని అవకాశాలు వచ్చినా మిస్‌ చేసుకున్నాం. నిన్న బౌలింగ్‌ చేద్దామని ముందే అనుకున్నాం. కానీ, అనుకున్నదానికంటే చాలా ముందుగానే బౌలింగ్‌ వేయాల్సి వచ్చింది. కొన్నిసార్లు గేమ్‌ప్లాన్లు ఫలించవు. మేం ఇప్పుడు 1-2తో వెనుకబడి ఉన్నాం. తప్పకుండా పుంజుకుని సిరీస్‌లో ముందడుగు వేస్తాం. వచ్చే రెండు మ్యాచుల్లోనూ గెలిస్తే సిరీస్‌ను నెగ్గేందుకు ఆస్కారముంది’’ అని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ వ్యాఖ్యానించాడు. 

అలాంటి షాట్లు ఆడకూడదని ముందే భావించా: జడేజా (Ravindra Jadeja)

‘‘జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రోహిత్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాల్సి వచ్చింది. అలాంటి సమయంలో నా బలాలు ఏంటని ఆలోచించా. నా సహజమైన ఆటతీరును ప్రదర్శించా. తొందరపాటు షాట్ల జోలికి అస్సలు పోలేదు. మ్యాచ్‌ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ముందుకుసాగా. వికెట్‌పై పూర్తి అవగాహన ఉంది. తొలుత బ్యాటింగ్‌ చేయడం చాలా సులువు. నాలుగో ఇన్నింగ్స్‌లో ట్రాక్‌ స్పిన్‌కు సహకరిస్తుంది. అలాగని వికెట్లు కూడా ఈజీగా వచ్చేయవు. దానిపై వర్కౌట్‌ చేయాలి. సరైన ప్రాంతంలో బంతులను సంధిస్తే.. వికెట్లు రాబట్టడం తేలికవుతుంది’’ అని రవీంద్ర జడేజా వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్‌లో జడ్డూ సెంచరీతోపాటు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని