Cricket News: షహీన్‌కు వైస్‌కెప్టెన్సీ బాధ్యతలు.. యువీ ‘ఆరు సిక్స్‌’లకు 16 ఏళ్లు!

Updated : 19 Sep 2023 17:19 IST

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డే జట్టులోకి భారత సీనియర్‌ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ వచ్చాడు. అశ్విన్‌ను ప్రశంసిస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక అంతర్జాతీయ మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్ ఆరు సిక్స్‌లు కొట్టి పదహారేళ్లు కావడంతో ఆ వీడియోను ఐసీసీ షేర్‌ చేసింది. మరోవైపు ఆసియా కప్‌లో సూపర్-4 దశకే పరిమితమైన పాకిస్థాన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

అశ్విన్‌ అనుభవం దానిని అధిగమిస్తుంది: రోహిత్

ఆసియా కప్‌లో అక్షర్ పటేల్ గాయపడటంతో అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సీనియర్ ఆటగాడు అశ్విన్‌ను కూడా సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. చివరిసారిగా గతేడాది జనవరిలో అశ్విన్‌ వన్డే మ్యాచ్‌ ఆడాడు. దీంతో చాలా వ్యవధి వచ్చాక జట్టులోకి ఎంపిక చేయడంపై కెప్టెన్ రోహిత్ శర్మ వివరణ ఇచ్చాడు. 

పాస్‌పోర్ట్‌ మరిచిన రోహిత్‌.. వైరల్‌గా మారిన కోహ్లీ ఒకప్పటి కామెంట్లు!

‘‘అశ్విన్‌ చాలా సీనియర్‌ ప్లేయర్. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంతో అనుభవం కలిగిన ఆటగాడు. కెరీర్‌లో ఇప్పటికే 90కిపైగా టెస్టులు, వందకుపైగా వన్డేలు ఆడాడు. ఇటీవల టెస్టుల్లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేశాడు. కాబట్టి, ఇలాంటి ప్లేయర్‌ మ్యాచ్‌లో కుదురుకోవడం పెద్ద సమస్యే కాదు. ఆ విషయంలో మాకు ఎలాంటి ఆందోళన లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా అతడితో మాట్లాడుతూనే ఉన్నాం. అశ్విన్ మానసికంగా, శారీరకంగా సిద్ధంగానే ఉన్నాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడాడు. ఆ తర్వాత తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ మంచి ప్రదర్శనే ఇచ్చాడు. కాబట్టి, క్రికెట్‌కు దూరంగా ఉన్నాడనే వాదన సరైంది కాదు. అతడు ఎలా బౌలింగ్‌ చేస్తున్నాడనేది మేం నిరంతరం గమనిస్తూనే ఉన్నాం’’ అని రోహిత్ తెలిపాడు. 


పాక్‌ పేసర్ షహీన్‌కు కీలక బాధ్యతలు!

ఆసియా కప్‌లో ఘోర ప్రదర్శనతో సూపర్-4 దశలోనే పాకిస్థాన్‌ ఇంటిముఖం పట్టింది. శ్రీలంక, భారత్‌ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. కీలక ఆటగాళ్లు సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతోనే పరాజయంపాలు కావాల్సి వచ్చిందని ఆ దేశ మాజీలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో వన్డే ప్రపంచ కప్‌ బరిలో దిగే జట్టులో మార్పులు చేయాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో వరల్డ్‌ కప్‌ జట్టుకు కెప్టెన్ బాబర్ అజామ్‌కు డిప్యూటీగా తొలుత ప్రకటించినట్లు షాదాబ్‌ ఖాన్‌ స్థానంలో స్టార్‌ పేసర్ షహీన్ అఫ్రిదిని ఎంపిక చేసినట్లు క్రీడావర్గాలు వెల్లడించాయి. ఆసియా కప్‌లో షాదాబ్‌ ఖాన్‌ ప్రదర్శన నిరుత్సాహానికి గురిచేయడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


యువీ ‘ఆరు సిక్స్‌’లకు పదహారేళ్లు

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్‌ సింగ్‌  2007 సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టాడు. ఈ ఫీట్‌కు నేటితో పదహారేళ్లు పూర్తయింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా యువీ ఈ ఘనతను సాధించడం విశేషం. అప్పటి ఇంగ్లాండ్‌ పేసర్ స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో యువీ ఆరు సిక్స్‌లు బాదేశాడు. టీ20ల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన తొలి బ్యాటర్‌గా యువీ అవతరించాడు. అంతకుముందు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో వాగ్వాదం జరిగిన తర్వాత యువీ తన విశ్వరూపం చూపించడం గమనార్హం. యువీ సిక్స్‌ల వీడియోను ఐసీసీ షేర్‌ చేసింది. మరోసారి మీరూ చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని