Rohit - Virat: పాస్‌పోర్ట్‌ మరిచిన రోహిత్‌.. వైరల్‌గా మారిన కోహ్లీ ఒకప్పటి కామెంట్లు!

ఆసియా కప్‌ (Asia Cup 2023) ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు శ్రీలంక నుంచి స్వదేశానికి తిరిగి పయనమైన సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ పాస్‌పోర్టు లేకుండానే బస్సు ఎక్కేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Updated : 19 Sep 2023 16:50 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ (Asia Cup 2023) నెగ్గిన ఆనందమో.. భారత్‌కు త్వరగా చేరుకోవాలనో కానీ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాడు. పాస్‌పోర్టు లేకుండానే ఎయిర్‌పోర్టుకు రోహిత్ పయనమయ్యాడు. ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు బస్సు ఎక్కిన సమయంలో.. హోటల్‌ గదిలో పాస్‌పోర్టు మరిచిపోయినట్లు అతడికి గుర్తుకొచ్చింది. వెంటనే సహాయక సిబ్బంది రోహిత్‌ పాస్‌పోర్ట్‌ను తీసుకొచ్చి ఇచ్చారు.

దీంతో 2017లో విరాట్ కోహ్లీ (Virat Kohli) చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు మరోసారి గుర్తు చేశారు. అప్పుడు ‘బ్రేక్‌ఫాస్ట్ విత్‌ ఛాంపియన్స్‌’ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘‘రోహిత్ శర్మలా ఎవరూ తమ వస్తువులను మరిచిపోరు. అతడు తరచూ వస్తువులను మరిచిపోతూ ఉంటాడు. ఐప్యాడ్స్‌, వాలెట్‌, ఫోన్.. ఇలాంటివి అందులో ఉంటాయి. ఓ రెండు మూడు సార్లు పాస్‌పోర్టును కూడా మరిచిన సంఘటనలు ఉన్నాయి. దీంతో రోహిత్ అన్ని వస్తువులను తెచ్చుకున్నాడా..? లేదా..? అనేది లాజిస్టికల్ మేనేజర్ చెక్‌ చేసిన తర్వాతనే బస్సు కదులుతుంది’’ అని కోహ్లీ (Kohli) తెలిపాడు. ఇప్పుడు శ్రీలంక నుంచి వచ్చే క్రమంలోనూ రోహిత్ (Rohit Sharma) పాస్‌పోర్టు మరిచిపోవడం గమనార్హం. ఇలా వస్తువులు మాత్రమే కాకుండా.. మ్యాచ్‌ల సందర్భంగా తుది జట్టులో ఎవరు ఉంటారు? అనే విషయాలను కూడా అప్పుడప్పుడు మరిచిన సంఘటనలూ ఉన్నాయి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని