Sachin Tendulkar: విమానంలో సచిన్‌.. అభిమానుల సర్‌ప్రైజ్‌: వీడియో

విమానం ఎక్కిన క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌(Sachin Tendulkar) అభిమానుల నుంచి ఈ సర్‌ప్రైజ్‌ ఊహించలేదు. తర్వాత ట్విటర్‌ ద్వారా వారికి కృతజ్ఞతలు తెలిపాడు. 

Published : 18 Dec 2022 17:15 IST

దిల్లీ: క్రికెట్‌కు వీడ్కోలు పలికి 9 ఏళ్లు గడుస్తున్నా టీమ్‌ఇండియా(Team India) దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా జరిగిన ఓ సంఘటన ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది. సచిన్‌ కనిపిస్తే చాలు అతడి అభిమాన గణం చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అయితే, శనివారం తన ప్రయాణంలో భాగంగా విమానం ఎక్కిన ఈ లెజెండ్‌కు ఊహించని స్వాగతం లభించింది. సచిన్‌(Sachin Tendulkar) వస్తున్నాడన్న వార్త తెలిసి విమానంలో అందరూ సచిన్‌ నినాదాలతో హోరెత్తించారు. వారు చూపిన ప్రేమాభిమానాలు సచిన్‌కు తన పాత రోజులను గుర్తుచేశాయి. ఆ వెంటనే ఇందుకు సంబంధించిన ఓ వీడియోను అతడు తన ట్విటర్‌లో పంచుకున్నాడు. 

‘‘కొద్దిసేపటి క్రితం నా కోసం నినాదాలు చేసిన ప్రతిఒక్కరికీ నా కృతజ్ఞతలు. నేను ఫీల్డ్‌లో బ్యాటింగ్‌కు దిగే రోజులను గుర్తుచేశారు.  దురదృష్టవశాత్తు సీటు బెల్టు ధరించాల్సిన సమయం కావడం వల్ల నేను పైకి లేచి మిమ్మల్ని పలకరించలేకపోయాను. అందరికీ నా తరఫు నుంచి బిగ్‌ హలో’’ అంటూ  ఓ ట్వీట్‌ చేశాడు. నెటిజన్లు సైతం ఈ వీడియోకు ‘సచిన్‌.. సచిన్‌’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రిటైర్మెంట్‌ తీసుకున్నప్పటికీ మాస్టర్‌ బ్లాస్టర్‌ పేరిట ఉన్న రికార్డులు మాత్రం ఇంకా పదిలంగానే ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు(34,357)తో పాటుగా 100 సెంచరీలు చేసి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో 51 శతకాలు సాధించాడు. వన్డేల్లో 49 శతకాలతో పాటు అత్యధిక పరుగుల(18426) రికార్డు సచిన్‌ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని