Sarfaraz Khan: సన్నీ సార్‌కు క్షమాపణలు చెబుతున్నా.. మరోసారి ఆ తప్పిదం చేయను: సర్ఫరాజ్‌

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో (IND vs ENG) తాను చేసిన పొరపాటును భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పునరావృతం చేయనని స్పష్టం చేశాడు. ఈసందర్భంగా సునీల్ గావస్కర్‌కు సారీ చెప్పడం విశేషం. 

Published : 13 Mar 2024 17:42 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో (IND vs ENG) జాతీయజట్టుకు అరంగేట్రం చేసిన సర్ఫరాజ్‌ ఖాన్‌ తన సత్తా చాటాడు. మూడు మ్యాచుల్లో 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం 200 పరుగులు చేసిన సర్ఫరాజ్‌పై ఓ విషయంలో మాత్రం క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్ అసహనం వ్యక్తంచేశాడు. క్రీజ్‌లో కుదురుకున్నాక చెత్త షాట్‌తో వికెట్‌ను సమర్పించడం సరైంది కాదని.. ప్రతిసారీ కొత్తగా బంతిని ఎదుర్కొంటాననే భావనతో ఆడే డాన్‌ బ్రాడ్‌మన్‌ వ్యాఖ్యలను గావస్కర్‌ ఉదహరించాడు. సన్నీ చేసిన వ్యాఖ్యలపై సర్ఫరాజ్ ఖాన్ కూడా బాధపడినట్లు శ్యామ్‌ భాటియా అనే వ్యాపారవేత్త వెల్లడించారు. సునీల్‌ గావస్కర్‌కు ఈయన అత్యంత ఆప్తులు. 

‘‘సర్ఫరాజ్‌ ఖాన్‌కు సునీల్‌ గావస్కర్‌ ఓ కీలక సూచన చేశాడు. షాట్ల ఎంపికపై హెచ్చరించాడు. దాదాపు 45 నిమిషాలపాటు అతడితో సన్నీ సంభాషించాడు. కానీ, టీ బ్రేక్‌ తర్వాత అలాంటి చెత్త షాట్‌కు సర్ఫరాజ్‌ ఔట్ కావడంతో గావస్కర్‌కు కాస్త ఆగ్రహం వచ్చింది. కామెంటేటరీ సందర్భంగా ఆ విషయాన్ని చెప్పాడు. మ్యాచ్‌ ముగిసిన మరుసటి రోజు సర్ఫరాజ్‌ నాతో మాట్లాడాడు. ‘గావస్కర్ సార్‌కు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను పొరపాటు చేశా. మరోసారి అలాంటి తప్పిదం పునరావృతం కాదు’ అని యువ ఆటగాడు అన్నాడు’’ అని శ్యామ్‌ భాటియా తెలిపారు. 

గావస్కర్‌ ఏమన్నారంటే? 

ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో దేవదత్ పడిక్కల్‌తో కలిసి సర్ఫరాజ్ ఖాన్ ఐదో వికెట్‌కు 97 పరుగులు జోడించాడు. రెండోరోజు టీ బ్రేక్‌ వరకు అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్‌..  ఆ తర్వాత తొలి బంతికే బంతిని అంచనా వేయడంలో విఫలమై వికెట్ సమర్పించాడు. దీనిపై గావస్కర్ స్పందిస్తూ.. ‘‘బంతి ఒక్కసారిగా పైకి లేచింది. అసలు షాట్‌ కొట్టేందుకు అనువుగానే లేదు. అయినా ఆడేందుకు ప్రయత్నించాడు. చివరికి వికెట్ ఇచ్చేశాడు. ఇంకాస్త సమయం తీసుకుంటే బాగుండేది. టీ బ్రేక్ తర్వాత తొలి బంతినే ఆవిధంగా ఆడాల్సిన అవసరం లేదు. ఇలాంటప్పుడే సర్ డాన్‌ బ్రాడ్‌మన్ మాటలను గుర్తు చేసుకోవాలి. ఆయన 200 పరుగులు సాధించినా.. సరే ఎదుర్కొనే తర్వాత బంతిని ‘0’ మీదే ఉన్నాననుకుంటారు. ఇక్కడ సర్ఫరాజ్‌ మాత్రం తొందరపాటుతో ఔటయ్యాడు’’ అని గావస్కర్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు