IPL 2024: పంత్ ఆడటం దిల్లీకే కాదు.. టీమ్‌ఇండియాకూ లాభమే: గంగూలీ

మరో ఇరవై రోజుల్లో ఐపీఎల్ (IPL 2024) 17వ సీజన్‌ ప్రారంభం కానుంది. తొలి పదిహేను రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు.

Published : 01 Mar 2024 15:41 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న భారత స్టార్‌ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) వచ్చే ఐపీఎల్ బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. దిల్లీ క్యాపిటల్స్‌కు (Delhi Capitals) ప్రాతినిధ్యం వహిస్తోన్న అతడు తప్పకుండా ఆడతాడని ఆ జట్టు మెంటార్‌ సౌరభ్‌ గంగూలీ (Ganguly) వ్యాఖ్యానించాడు. అది దిల్లీతోపాటు టీమ్‌ఇండియాకు శుభవార్త అవుతుందని తెలిపాడు. ఇటీవలే పంత్‌ను కలిసినట్లు మాజీ కెప్టెన్ వెల్లడించాడు. అతడితో మాట్లాడిన తర్వాతనే తాను ఇలాంటి కామెంట్లు చేయగలుగుతున్నట్లు పేర్కొన్నాడు. 

‘‘దిల్లీ క్యాపిటల్స్‌కు ఉత్సాహాన్నిచ్చే న్యూస్. ఐపీఎల్‌లో భారత క్రికెటర్లు గోల్డ్‌. ప్రతీ మ్యాచ్‌లో కీలకం వారే. రిషభ్‌ పంత్‌ ఏడాదికిపైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఐపీఎల్‌లో ఆడటం వల్ల త్వరగానే బ్యాటింగ్‌ లయను అందుకొంటాడని భావిస్తున్నా. పునరాగమనం కోసం తీవ్రంగా సాధన చేస్తున్నాడు. త్వరలోనే అతడు దిల్లీ క్యాపిటల్స్‌తోపాటు భారత్‌ జట్టుకు ఆడతాడు. ఈ సీజన్‌లో పంత్ ఆటను చూడబోతుండటం ఆనందంగా ఉంది. నేను ఇటీవలే బెంగళూరులో పంత్‌ను కలిశా. మహిళల ప్రీమియర్‌ లీగ్ (WPL 2024) ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడా. అతడు బెంగళూరులోనే సాధన చేస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆడేందుకు ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు’’ అని గంగూలీ వెల్లడించాడు. 

బ్యాటర్‌గానే.. పంత్ వస్తాడు 

రిషభ్‌ పంత్‌ ఐపీఎల్ బరిలోకి దిగినా.. పూర్తిస్థాయిలో ఆడటం కష్టమేనన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ (IPL 2024) సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేవలం 15 రోజుల షెడ్యూల్‌ మాత్రమే విడుదలైంది. దిల్లీ తన రెండో హోం గ్రౌండ్‌గా వైజాగ్‌ను ఎంచుకుంది. రిషభ్‌ పంత్ తొలి ఏడు మ్యాచులకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉందని.. అయితే, కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడతాడని దిల్లీ క్యాపిటల్స్‌ సహ యజమాని పార్థ్‌ జిందాల్ వెల్లడించారు. కీపింగ్‌ బాధ్యతలను ఇప్పుడే చేపట్టకపోవచ్చని పేర్కొన్నాడు. నేరుగా మైదానంలోకి దిగినప్పుడు ఒకేసారి అతడిపై భారం మోపకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని