KL Rahul: రాహుల్.. వరమా భారమా?
KL Rahul: టీమ్ ఇండియాలో ఓ వెలుగు వెలిగిన కేఎల్ రాహుల్.. ఇప్పుడు ఫామ్, ఫిట్‌నెస్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అయినా కొన్నేళ్ల నుంచి విమర్శల మధ్యే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ స్థితిలో ఆసియా కప్‌కు ఆడుతున్న రాహుల్.. ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
కేఎల్ రాహుల్.. చాలా ఏళ్ల నుంచి వివిధ ఫార్మాట్లలో రెగ్యులర్‌గా టీమ్‌ఇండియాకు ఆడుతున్న క్రికెటర్లలో ఒకడు. కోహ్లి, రోహిత్‌ల తర్వాత ఆ స్థాయి అందుకోగల ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యాటర్‌లో ప్రతిభకు లోటేమీ లేదు. కానీ తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉన్నాడు. జట్టు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రతిసారీ నిరాశపరచడం అతడికి అలవాటుగా మారింది. గాయం కారణంగా కొన్ని నెలలుగా టీమ్‌ఇండియాకు దూరంగా ఉన్న ఈ స్టార్ బ్యాటర్.. ఆసియా కప్ కోసం తిరిగి జట్టులోకి వచ్చాడు. కానీ ఫామ్, ఫిట్‌నెస్ మీద సందేహాలుండటంతో జట్టుకు అతడు భారంగా మారుతాడేమో అన్న భయాలు కలుగుతున్నాయి.
గత పదేళ్లలో కోహ్లి, రోహిత్ కాకుండా మూడు ఫార్మాట్లలో భారత జట్టుకు ఎక్కువ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన బ్యాటర్లలో కేఎల్ రాహుల్ ఒకడు. ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఈ కర్ణాటక ఆటగాడు.. కెరీర్ ఆరంభంలోనే అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టాడు. ఆస్ట్రేలియాలో జరిగిన తన తొలి టెస్టు సిరీస్‌లోనే సెంచరీ కొట్టి తన సత్తా ఏంటో చూపించాడు. ఆ తర్వాత కూడా వివిధ ఫార్మాట్లలో కొన్ని మేటి ఇన్నింగ్స్‌లు ఆడాడు రాహుల్. 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కేఎల్ ఇప్పటిదాకా 47 టెస్టులాడి 33.44 సగటుతో 2642 పరుగులు చేశాడు. వన్డేల్లో 54 మ్యాచ్‌లాడి 45.13 సగటుతో 1986 పరుగులు సాధించాడు. టీ20 ఫార్మాట్లో అతనాడిన మ్యాచ్‌లు 72 కాగా.. పరుగులు 2265, సగటు 37.75. కేఎల్ మీద కెరీర్ ఆరంభంలో నెలకొన్న అంచనాల ప్రకారం చూస్తే అతడిది గొప్ప ప్రదర్శనేమీ కాదు.
గంటలోపే టికెట్ల విక్రయం.. ఇలాంటి డ్రామాలు ఆడొద్దంటున్న ఫ్యాన్స్!
ఒక మ్యాచ్‌లో మెరుపులు మెరిపించి తర్వాత కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమవడం.. ముఖ్యమైన మ్యాచ్‌లు చేతులెత్తేయడం, పరిమిత ఓవర్ల క్రికెట్లో తక్కువ స్ట్రైక్ రేట్ నమోదు చేయడం.. లాంటి బలహీనతల కారణంగా విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ.. అతనాడిన కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టులో తన స్థానానికి ఎసరు రాకుండా చూస్తున్నాయి. కెప్టెన్లు, కోచ్‌లు మారుతున్నా జట్టు యాజమాన్యంలో అతడిపై నమ్మకం సడలడం లేదు. కొన్నేళ్ల నుంచి విమర్శల మధ్యే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
కొనసాగుతున్న సందిగ్ధత
గత ఏడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా రాహుల్ ప్రదర్శన తీవ్ర విమర్శలకు దారి తీసింది. ముఖ్యంగా వన్డేలు, టీ20ల్లో అతడి స్ట్రైక్ రేట్ మీద చాలా చర్చే నడిచింది. అయినా రాహుల్‌కు అవకాశాలు ఆగిపోలేదు. రాహుల్‌ది అసాధారణ ప్రతిభ అని, తనదైన రోజు ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగలడని కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా అతణ్ని వెనకేసుకొచ్చాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో రాహుల్ కీలక పాత్ర పోషిస్తాడని ద్రవిడ్‌తో పాటు కోచ్ రోహిత్ శర్మ అతడిపై నమ్మకం పెట్టుకున్నారు.
ఐతే ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో గాయపడి మైదానానికి దూరమయ్యాడు రాహుల్. తొడ గాయం తీవ్రమైందే కావడంతో శస్త్ర చికిత్స కూడా అవసరమైంది. దాన్నుంచి కోలుకోవడానికి రాహుల్ ఎక్కువ సమయమే తీసుకున్నాడు. ఈ మధ్యే అతడు ఫిట్‌నెస్ సాధించడంతో పాటు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడుతున్నట్లు వార్తలొచ్చాయి. దీంతో సెలక్టర్లు రాహుల్‌ను ఆసియా కప్‌కు ఎంపిక చేశారు. కానీ జట్టును ప్రకటిస్తున్న సమయంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ట్విస్ట్ ఇచ్చాడు. రాహుల్‌కు మళ్లీ చిన్న గాయం అయిందని పేర్కొంటూ సంజు శాంసన్‌ను బ్యాకప్ ప్లేయర్‌గా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడేమో ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండడని, పాకిస్థాన్‌పై ఆడడని అంటున్నారు. ప్రపంచకప్‌నకు నెల రోజుల ముందు ఇలాంటి ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాడి నుంచి ఆ మెగా టోర్నీలో ఏం ఆశించగలమనే ప్రశ్న తలెత్తుతోంది.
2019 గుర్తుందా?
2019 ప్రపంచకప్ ముంగిట ఏం జరిగిందో గుర్తుండే ఉంటుంది. అంబటి రాయుడు లాంటి ప్రతిభావంతుడు, పోరాట యోధుడిని కాదని.. త్రీ డైమన్షన్ ప్లేయర్ అంటూ విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఐతే శంకర్ ఏ డైమన్షన్లోనూ జట్టుకు ఉపయోగపడలేదు. టోర్నీ అంతటా కూర్పు సమస్యతో ఇబ్బంది పడింది భారత్. అది టోర్నీలో జట్టు అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపింది. రాయుడు ఉంటే కథ వేరుగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెలక్షన్లో ఇలాంటి తప్పిదాలే కొన్నిసార్లు ప్రపంచకప్‌లను దూరం చేస్తాయి. ఇలాంటి పొరపాట్లు ఈ ప్రపంచకప్ ముంగిట పునరావృతం కాకూడదని అభిమానులు ఆశిస్తున్నారు.
ఒకసారి భారత్.. మరోసారి పాక్ లేకుండా ఆసియా కప్.. ఎందుకో తెలుసా?
కానీ రాహుల్ మీద జట్టు చూపిస్తున్న అతి నమ్మకం చేటు చేస్తుందేమో అన్న ఆందోళన లేకపోలేదు. రాహుల్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నపుడే నిలకడగా ఆడింది లేదు. కీలక మ్యాచ్‌ల్లో చాలాసార్లు చేతులెత్తేశాడు. అలాంటిది ఇప్పుడు అతడి ఫిట్‌నెస్‌పై సందేహాలున్నాయి. నాలుగు నెలలుగా మైదానానికి దూరంగా ఉండి.. ఫిట్‌నెస్, ఫామ్ మీద సందేహాలతో ఇప్పుడు జట్టుకు ఎంపికయ్యాడు. ప్రపంచకప్‌నకు ముందు భారత్ ఇంకో ఆరేడు మ్యాచ్‌లే ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లు అన్నింట్లో ఆడినా రాహుల్ లయ అందుకుంటాడా అన్నది సందేహమే. అలాంటిది ఆసియా కప్‌లో కూడా రెండు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు రాహుల్. ఇలాంటి స్థితిలో ఉన్న ఆటగాడిని ప్రపంచకప్‌నకు ఎంపిక చేయడం అంటే గాల్లో దీపం పెట్టడం లాంటిదే అనిపిస్తోంది. దాని కంటే తిలక్ వర్మకో, మరో యువ ఆటగాడికో ఛాన్స్ ఇస్తే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
ODI WC 2023: రోహిత్ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టం: పాక్ వైస్ కెప్టెన్
-
USA vs China: ‘తప్పుడు సమాచారం’పై.. అమెరికా-చైనా మాటల యుద్ధం
-
Social Look: దీపికా పదుకొణె ‘కోల్డ్ మీల్’.. శ్రీనిధి శెట్టి ‘ఈఫిల్ టవర్’ పిక్!
-
Manipur : మణిపుర్ విద్యార్థుల హత్య కేసు.. నలుగురిని అరెస్టు చేసిన సీబీఐ
-
OPS: రామ్‌లీలా మైదానం జనసంద్రం.. ఓపీఎస్ పునరుద్ధరణకు కదం తొక్కిన ఉద్యోగులు