Virat Kohli: పొట్టి కప్‌నకు విరాట్‌ కోహ్లీ దూరం.. ఈ వార్తలు నిజం కాకూడదు: స్టువర్ట్‌ బ్రాడ్

విరాట్ కోహ్లీ లేకుండా టీ20 వరల్డ్‌ కప్‌లో (T20 World Cup 2024) భారత్ జట్టు ఆడటం అభిమానులు ఊహించగలరా? ఇదే అభిప్రాయం ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడికీ వచ్చింది.

Published : 13 Mar 2024 12:40 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జూన్‌లో మొదలయ్యే టీ20 ప్రపంచ కప్‌లో భారత స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆడటం లేదు. యువ క్రికెటర్ల కోసం వైదొలుగుతున్నాడు.. ఇవీ గత కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్ అగార్కర్‌ కూడా విరాట్‌తో మాట్లాడినట్లు కథనాలు వచ్చాయి. అయితే, ఐపీఎల్‌ 2024 సీజన్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన ఆధారంగా అతడి భవితవ్యం తేలనుందనే వార్తలూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్ స్టువర్ట్‌ బ్రాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ లేకపోతే వరల్డ్‌ కప్‌ టోర్నీకి క్రేజ్‌ తగ్గడం ఖాయమన్నాడు. వెస్టిండీస్ - అమెరికా వేదికగా పొట్టి కప్‌ సంబరం ప్రారంభం కానుంది. 

‘‘సోషల్‌ మీడియాలో వస్తున్న కథనాలు నిజం కాకూడదు. అభిమానుల కోణంలో చూస్తే.. ఈ వరల్డ్‌ కప్‌ను ఐసీసీ అమెరికాలో నిర్వహించడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందరి దృష్టిని ఆకర్షించే టాప్‌ ప్లేయర్ విరాట్ కోహ్లీ తప్పకుండా పొట్టి కప్‌ కోసం ఎంపిక అవుతాడు’’ అని బ్రాడ్ పోస్టు చేశాడు. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడలేదు. ఇటీవలే అనుష్క శర్మ రెండో బిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. చాలా రోజుల విరామం తర్వాత విరాట్ ఐపీఎల్ 2024 సీజన్‌ కోసం సిద్ధమవుతున్నాడు. 

ఆర్సీబీతో కలిసిన కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌

మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఇప్పటికే ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశారు. తాజాగా ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్‌ డుప్లెసిస్‌ తన జట్టుతో కలిశాడు. ఈ మేరకు తమ జట్టు సారథి వచ్చినట్లు ఆర్సీబీ యాజమాన్యం సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ‘‘కెప్టెన్ ఫాఫ్ వచ్చేశాడు. తొలి పోరు కోసం సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చాడు’’ అని క్యాప్షన్ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని