Cricket News: భారత్‌కు అది మంచి సమస్యే.. చాహల్‌ ఎంపిక ఆశ్చర్యకరం.. పాక్‌కు పాస్‌పోర్ట్‌ కష్టాలు..

Updated : 11 Dec 2023 11:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత జట్టులో ఓపెనర్లకు కొరతే లేదు. ఇప్పుడది మంచి సమస్యగా మారిందని దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. వన్డేలకు టీ20 బౌలర్‌ను ఎంపిక చేయడం ఓ మాజీ ఆటగాడిని సర్‌ప్రైజ్‌కు గురి చేసిందట.. ఆసీస్‌ పర్యటనలో ఉన్న పాక్‌కు వైద్యుడు లేక కష్టాలు వచ్చాయి.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..

ఓపెనర్లుగా నలుగురు ఉండటంపై సునీల్ గావస్కర్

టీ20 ప్రపంచ కప్‌ కోసం సన్నద్ధమవుతున్న టీమ్‌ఇండియాకు ప్రధాన సమస్య జట్టు కూర్పేనని మాజీ క్రికెటర్లు ఆందోళన చెందుతున్న వేళ.. క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ మాత్రం ఇది తప్పకుండా భారత్‌కు మంచి సమస్యేనని వ్యాఖ్యానించాడు. ‘‘దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్, శుభ్‌మన్‌ గిల్ ఓపెనర్లుగా ఉన్నారు. ఒకవేళ జట్టు మేనేజ్‌మెంట్ ఎడమచేతివాటం బ్యాటర్‌తో బరిలోకి దిగాలని భావిస్తే యశస్వికి అవకాశం దక్కుతుంది. అప్పుడు గిల్‌తోపాటు యశస్వి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. ఇక టీ20 వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మ అందుబాటులోకి వస్తాడని చెబుతున్నారు. దీంతో నలుగురు ఓపెనర్లు సిద్ధంగా ఉన్నట్లవుతుంది’’ అని గావస్కర్‌ తెలిపాడు.


వన్డేలకు చాహల్‌ ఎంపిక ఆశ్చర్యకరం

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు యుజ్వేంద్ర చాహల్‌ను ఎంపిక చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ‘‘చాహల్‌ టీ20 స్పెషలిస్ట్‌. అతడిని పొట్టి సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం.. వన్డేలకు తీసుకోవడం సర్‌ప్రైజ్‌కు గురి చేసింది. భారత మేనేజ్‌మెంట్ ‘పనిభారం’ తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి. దీపక్‌ చాహర్‌, అవేశ్‌ ఖాన్‌ వంటి ఆటగాళ్లకు మళ్లీ అవకాశం దక్కింది. ముకేశ్‌ కుమార్‌ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. రజత్‌ పటీదార్‌ను జట్టులో చూడటం ఆనందంగా ఉంది. టీ20లు ఆడిన రింకు సింగ్‌కు ప్రమోషన్‌ వచ్చింది. వన్డే ఫార్మాట్‌లోనూ అడుగు పెట్టబోతున్నాడు. సంజూ శాంసన్‌కు చాన్నాళ్ల తర్వాత ఛాన్స్‌ వచ్చింది. అయితే, అతడు ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది’’ అని సంజయ్‌ వ్యాఖ్యానించాడు. 


పాస్‌పోర్ట్‌ గడువు ముగియడంతో.. 

పాకిస్థాన్‌ సీనియర్‌ జట్టుతోపాటు అండర్‌-19 టీమ్‌కు కష్టాలు తప్పలేదు. ప్రస్తుతం ఆసీస్‌ పర్యటనలో ఉన్న పాక్‌ తమ జట్టు డాక్టర్‌ లేకుండానే ఆడాల్సిన పరిస్థితి. పాస్‌పోర్ట్‌ గడువు ముగియడంతో పాక్‌ టీమ్‌ వైద్యుడు సోహైల్‌ సలీమ్ ఆసీస్‌కు వెళ్లలేకపోయాడు. ‘‘ పాక్‌ క్రికెట్‌ బోర్డు ఈ విషయంపై దృష్టిసారించింది. డాక్టర్‌ సలీమ్‌ పాస్‌పోర్ట్‌ను త్వరగా రెన్యువల్‌ చేయించి ఆసీస్‌తో పెర్త్‌ టెస్టు సమయానికైనా జట్టు వద్దకు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది’’ అని పీసీబీ వర్గాల వెల్లడించాయి. 

మాజీ ఆటగాడు, అండర్‌ -19 టీమ్‌ మేనేజర్‌ షోయబ్‌ మహమ్మద్‌ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం అండర్‌-19 ఆసియా కప్‌ కోసం యూఎఈలో పాక్‌ జట్టు ఉంది. అయితే, షోయబ్‌ పాస్‌పోర్ట్‌ గడువు కూడా ముగిసింది. దీంతో అతడు జట్టుతోపాటు వెళ్లలేకపోయాడు. ‘‘షోయబ్‌ కూడా పాస్‌పోర్ట్‌ సమస్యతో ఇబ్బంది పడ్డారు. త్వరలోనే జట్టుతో చేరేందుకు యూఏఈ చేరుకుంటాడు’’ అని క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు