IND vs AFG: మ్యాచ్‌లో హైడ్రామా.. రెండో సూపర్‌ ఓవర్‌లో భారత్ విజయం..

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో భారత్‌ విజయం సాధించి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది.

Updated : 18 Jan 2024 01:08 IST

ఓ వైపు క్లీన్‌స్వీప్‌ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్న భారత్‌.. మరోవైపు ఒక్కమ్యాచ్‌ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని అఫ్గాన్‌.. ఇలా ప్రారంభమైన మూడో టీ20 మ్యాచ్‌ అత్యంత నాటకీయంగా ముగిసింది.

తొలుత భారీ స్కోర్‌ చేసిన టీమ్‌ఇండియా.. విజయం తమదేనన్న భరోసాతో ఉన్న వేళ.. ప్రత్యర్థి జట్టు అనూహ్యంగా చెలరేగడంతో మ్యాచ్‌ టై అయి సూపర్‌ ఓవర్‌కు వెళ్లింది. ఇక అక్కడా అదే హైడ్రామా.. ఫలితం మళ్లీ రిపీట్‌..

ఇక రెండో సూపర్‌ ఓవర్‌లోనూ అదే ఉత్కంఠ.. బ్యాటింగ్‌ చేసిన భారత్‌ ప్రత్యర్థి ఎదుట స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన వేళ.. ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి.. అయితే ఇక్కడే మన బౌలర్‌ బిష్ణోయ్‌ మాయ చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.   

బెంగళూరు: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20 (IND vs AFG) భారత్‌ విజయం సాధించింది. అత్యంత నాటకీయంగా రెండోసారి సూపర్‌ ఓవర్‌కు దారితీసిన ఈ మ్యాచ్‌లో భారత్‌ (Team India) గెలుపొంది సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలుత భారత్‌ నిర్దేశించిన 212 లక్ష్యాన్ని అఫ్గాన్‌ (Afghanistan) సమం చేయడంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ ఒక వికెట్‌ కోల్పోయి 16 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ తొలి నాలుగు బంతుల్లో 14 పరుగులు చేసింది. రెండు బంతుల్లో మూడు పరుగులు చేస్తే చాలు. అయితే చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు రావడంతో మళ్లీ స్కోర్‌ సమం అయింది. దీంతో మ్యాచ్‌ రెండోసారి సూపర్‌ ఓవర్‌కు దారితీసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 11 పరుగులే చేసి ప్రత్యర్థికి స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక బౌలింగ్‌కు దిగిన బిష్ణోయ్‌ మూడు బంతుల్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్‌ కథ ముగిసింది.   

రోహిత్‌, రింకు ఆకాశమే హద్దుగా..

తొలుత భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (4), కోహ్లీ (0), శివమ్ దూబె (1), సంజు శాంసన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. దీంతో 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రోహిత్ శర్మ (121*; 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లు), రింకు సింగ్ (69*; 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. చివరి ఐదు ఓవర్లలో భారత్ ఏకంగా 103 పరుగులు చేసింది. దీంతో భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది.  

ఈ భారీ లక్ష్యఛేదనలో అఫ్గాన్ చివరి బంతి దాకా పోరాడి ఆరు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయింది. అఫ్గాన్‌ బ్యాటర్లలో ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్‌ (50; 32 బంతుల్లో), ఇబ్రహీం జద్రాన్ (50; 41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), గుల్బాదిన్ నైబ్ (55* 23 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), మహ్మద్ నబీ (34; 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్‌ 3, అవేశ్‌ ఖాన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

 రెండు సూపర్‌ ఓవర్లు సాగాయి ఇలా.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని